గీసుగొండ, ఏప్రిల్ 26: పట్టుదలతో చదివితే ఏదైనా సాధించొచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్య నోడల్ అధికారి మాధవరావు విద్యార్థులకు సూచించారు. మండలకేంద్రలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మా ట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలన్నారు. నేటి సమాజంలో విద్యతోనే గుర్తిం పు, హోదా లభిస్తుందని తెలిపారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థులు తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించి అందుకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లలు ఉన్నత విద్యలో రాణించినప్పుడే తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశోక్‌రావు, వర్ధన్నపేట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జితేందర్‌రెడ్డి, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీపీ భీమగాని సౌజన్య, సర్పంచ్ డోలి రాధాబాయి, అధ్యాపకులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
సంగెం: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని డీఐఈవో కే మాధవరావు అన్నారు. సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వినియోగించకొని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకతను చాటాలన్నారు. అనంతరం ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎం మనీష, మేడి రుత్విక, సముద్రాల సునీతకు ఈ సందర్భంగా డీఐఈవో చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలు అందించారు. కార్యక్రమంలో సంగెం, వర్ధన్నపేట, ఆత్మకూరు ప్రిన్సిపాళ్లు నూకల శ్రీకాంత్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, బీ నర్సింహారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.