రాయపర్తి, ఏప్రిల్ 26 : మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ (చారిత్రక సన్నూరు ఆలయం) అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. సుమారు 800 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్ధి కోసం రూ.10 కోట్లను ప్రభుత్వం వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాలతో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఆలయాన్ని సందర్శించారు. ఈఈ కే దుర్గా ప్రసాద్, డీఈ రమేశ్‌బాబు, ఏఈ దుర్గా ప్రసాద్‌రావు, మండల పంచాయతీరాజ్ ఏఈ శేషం కిరణ్‌కుమార్ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సారథ్యంలో ఆలయాన్ని సందర్శించి భక్తులు, ఆలయ అనువంశిక పూజారులు, ధర్మకర్తలతో మట్లాడారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన అభివృద్ధి కోసం అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక పూజారులు ఆరుట్ల రంగాచార్యులు, వెంకట రామకృష్ణమాచార్యులు, వెంకట రమణాచార్యులు, సన్నూరు, వెంకటేశ్వరపల్లి గ్రామాల సర్పంచ్‌లు నలమాస సారయ్య, గూబ యాకమ్మ-ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.