అపూర్వ ఘట్టానికి ప్రముఖ శైవక్షేత్రం ఐనవోలు ముస్తాబైంది. 1100 ఏళ్ల నాటి ఈ మల్లికార్జునస్వామి ఆలయంలో మొదటిసారి పునరావర్తన మహాకుంభాభిషేకం జరుగబోతున్నది. శాస్త్ర ప్రకారం ప్రతి పుష్కరానికి ఒకసారి మహాకుంభాభిషేకం నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించాలని ఈవో, అర్చక బృందం, ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ అరుదైన వేడుకకు నలుగురు పీఠాధిపతులు విచ్చేయనుండగా తొలిరోజు యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, 24న ప్రభోత్సవం, 25న మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఆలయంలో తొలిసారి జరిగే ఈ ఉత్సవాలకు భక్తజనం భారీగా తరలిరానుండడంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
– ఐనవోలు, ఏప్రిల్ 22
చరాచర సృష్టిలో భగవంతుడు సర్వాంతర్యామి. ‘సాధకస్యహితార్థాయ బ్రహ్మోణోరూపకల్పనా’ అని విగ్రహారాధన ప్రాముఖ్యతను ఆగమశాస్త్రం చెబుతున్నది. ‘శివధర్మాత్ పరోధర్మః నభూతో నభవిష్యతి’ శివధర్మమును మించిన ధర్మము మరొకటి లేదని సప్రభేదాగమం ప్రతిపాందించినది. శివధర్మమునందు పునరావర్తనం మిక్కిలి ప్రాధాన్యమైంది. రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలులో విరాజమానమైన మల్లికార్జునస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం నిర్మించి సుమారు 1100 ఏళ్లు పూర్తి కావస్తోంది. శాస్త్ర ప్రకారం ప్రతి పుష్కరానికి(12 ఏళ్ల) ఒక్కసారి ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించాలి. గతంలో పూర్వీకులు ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించారో, లేదో తెలియదు. ఈ నేపథ్యంలో ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రప్రథమంగా పునరావర్తన మహాకుంభాభిషేకం నిర్వహించాలని ఈవో, అర్చక బృందం, ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ మహాకుంభాభిషేకానికి నాలుగు పీఠాల అధిపతులను ఆహ్వానించారు. కంచికామకోటి పీఠాథిపతి, జగద్గురు శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామి దివ్య కరకమలములచే మల్లికార్జునస్వామి క్షేత్ర ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్ పర్యవేక్షణలో ప్రముఖ శైవాగమపండితులు కోమాళ్లపల్లి సంపత్‌కుమార్‌శర్మ ఆచార్యత్వమున త్రయాహ్నిక దీక్షతో శైవాగమోక్తంగా ప్రసాద పునరావర్తన మహాకుంభిషేక మహోత్సము అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
నేటి నుంచి 25 వరకు జరిగి మహాకుంభాభిషేక మహోత్సవానికి కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి, జగద్గురు విద్యారణ్యభారతీ స్వామి, శ్రీక్షేత్రం నాచారం గుట్ట పీఠాథిపతి మధుసూదనానంద సరస్వతి, కాకతీయ సంస్థానం గోవిందానంద సరస్వతీ స్వామి రానున్నారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎమ్మెల్యేలు మహాకుంభాభిషేకం మహోత్సంలో పాల్గొననున్నారు.
23న శనివారం ఉదయం 9 గంటలకు ఉత్సవ అనుజ్ఞ గణేశపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యస్థాపన, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, రుత్విగ్వరుణ, దీక్షధారణ, అస్త్రరాజార్చన, మృత్యంగ్రహణ గంగాది మహాపుణ్యతీర్థనిక్షపణ, సోమకుంభస్థాపన, అద్భుతశాంతి, అగ్నిప్రతిష్ఠాపన, పాత్రాసాధన, కుండేవహ్ని నిక్షేపణ, మన్త్రతర్పణ, నవకుంభస్థాపన, ధ్వజారోహణ, ప్రధాన కుంభస్థాపన, దేవోపచారములు, తీర్థప్రసాద వితరణ ఉంటాయి.
24న ఆదివారం ఉదయం నిత్యవిధి, సోమకుంభతీర్థమార్జనన, పునరావర్తన అనుష్ఠానములు, వాస్తుశాంతి, విశేష బలిహరణ, తీర్థసంగ్రహణ, అధివాసం, మూర్తిహోమం, అంతర్మాతృకా బహిర్మాతృకాన్యాసం, సహస్రకుంభార్చన, చతుర్నవతి-చతుష్షష్ఠి- శాలాంగ దేవతా మూలమస్త్రహవనం, న్యాసం, సా:గ్రామోత్సవం, ప్రభోత్సవం, కలశస్థాపన, నీరాజన, దేవోపచారం, తీర్థప్రసాద వితరణ.
25న సోమవారం నిత్యౌపాపన, శ్రీ శివపంచ వింశతిమూర్త్యర్చన, ఆవరణ పూజ ఉదయం 7-47గంటలకు ధనిష్ఠా నక్షత్ర వృషభలగ్న, సుముహూర్తాన జీవన్యాసం, కల్యాన్యాసం, మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. మహాపూర్ణాహుతి, అవభృథం, త్రిశూలస్నానం, జగద్గురువుల దివ్య అనుగ్రహభాషణం, ఆచార్య పూజ, మహదాశీర్వచన, తీర్థప్రసాద వితరణ, మహా అన్నదానం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే మహాకుంభాభిషేక ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశాం. యాగశాల, హోమ గుండాలు సిద్ధం చేయించాం. వేసవి దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాం.
ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగే ఈ అపూర్వ ఘట్టం మా కమిటీ సభ్యుల హయాంలో జరుగడం సంతోషంగా ఉంది. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేశాం. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నాయలందరినీ ఆహ్వానించాం.
– మునిగాల సంపత్‌కుమార్ ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యుడు