ఖానాపురం, ఏప్రిల్ 22: తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నదని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఉచిత ఆరోగ్య మేళాను శుక్రవారం వారు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో డీఎంహెచ్ఎం, ఎంపీపీ మాట్లాడుతూ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. శారీరక శ్రమ తక్కువ కావడం, మానసిక ఒత్తిళ్లు పెరుగుతుండడం, నూనె పదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ విధిగా రక్త, మూత్ర, గుండె, క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందస్తు పరీక్షలతో అనేక వ్యాధులను ఆదిలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందిస్తే వ్యాధుల నుంచి బయటపడొచ్చన్నారు. పట్టణ వాసుల్లో ఎక్కువ మంది వ్యాధుల బారిన పడడానికి ప్రధాన కారణం తగినంత శారీరక శ్రమ లేకపోవడమేనని వివరించారు.
ప్రతి ఒక్కరూ ఉదయం అరగంటపాటు వాకింగ్ చేయాలన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య మేళా దోహదం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీతోపాటు తాసిల్దార్ జూలూరి సుభాషిణి, ఎంపీడీవో సుమనావాణికి డాక్టర్లు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఆరోగ్య మేళాలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో పౌష్టికాహారం స్టాల్స్ ఏర్పాటు చేశారు. కాగా, ఆరోగ్య మేళాకు మండల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. బీపీ, షుగర్‌తోపాటు నేత్ర, దంత, కుష్ఠు, క్షయ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వోలు ప్రకాశ్, గోపాల్‌రావు, మండల వైద్యాధికారి అరుణ్‌కుమార్, సర్పంచ్ చిరంజీవి, ఎంపీటీసీలు మర్రి కవిత, భారతి, ఆయుష్ జిల్లా కో ఆర్డినేటర్ రామారావు, ఆయుర్వేదిక్ డాక్టర్లు జయ ప్రకాశ్, శ్రీలత, అనిత, శ్రీదేవి, రేవతి, శ్వేత, ఫిజియోథెరపిస్ట్ నర్సింహారెడ్డి, డీపీఎంవో దేవిక, ఆర్బీఎస్కే డాక్టర్ రవీందర్, రాహుల్, మృదుల, దివ్య, జులేఖ, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమ, అంగన్వాడీ టీచర్లు మల్లికాంబ, రాణి, నాగమణి పాల్గొన్నారు.