భక్తుల పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం సందడిగా మారింది. ప్రాణహిత పుష్కరాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి 40వేల మంది తరలివచ్చి నిండు మనస్సుతో నదీమాతకు ప్రణమిల్లారు. నదిలో పుష్కర స్నానాలు ఆచరించి సైకత లింగాలను పూజించారు. ఈ సందర్భంగా నదిలో దీపాలు వదిలారు. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలతో పాటు ఎడ్లబండ్లపైనా భక్తులు కాళేశ్వరం బాట పడుతున్నారు. దీంతో ఎటువైపు చూసినా కాళేశ్వర క్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది. సాయంత్రం వేళ ఆలయ అర్చకులు త్రివేణి సంగమ తీరాన నదికి సద్యోజాత హారతి ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, అర్చకుల వేదమంత్రాల నడుమ వెళ్లి ప్రాణహిత మాతకు వాయినం ఇచ్చారు. పూలు, పండ్లు వస్రాలు, కుంకుమ, పసుపు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా హారతి ఇచ్చారు. పుష్కర ఘాట్ వద్ద కంచి పీఠం స్వాముల ఆధ్వర్యంలో కూడా హారతి కార్యక్రమం నిర్వహించారు.ఇక్కడ జడ్పీ సీఈవో శోభారాణి డీఎస్పీ కిషన్ ,ఈవో మహేశ్, ఎంపీపీ రాణీబాయి, జడ్పీటీసీ అరుణ ఎంపీటీసీ మమత, సర్పంచ్ వసంత ఉన్నారు.
– కాళేశ్వరం, ఏప్రిల్ 16
ఆలయానికి రూ.4.60 లక్షల అదాయం
కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి ఆలయానికి రూ.4.60 లక్షలు ఆదాయం వచ్చింది. పుష్కరాల్లో భాగంగా వివిధ పూజలు, దర్శనాలు, లడ్డూ, పులిహోర విక్రయాలతో ఈ ఆదాయం సమకూరినట్లు ఈవో మహేశ్ తెలిపారు.