వాజేడు, ఏప్రిల్ 15 : జీడి పప్పు (కాజూ) కొనాలంటే సామాన్యుడు భయపడుతాడు.. కానీ, తినేందుకు అందరూ ఇష్టపడుతారు. కాజూలను అందించే జీడి మామిడి తోటలు వాజేడు మండలంలో పుష్కలంగా ఉన్నాయి. ప్రగళ్లపల్లి, ధర్మవరం, చింతూరు, కృష్ణాపురం, వాజేడు, శ్రీరాంనగర్, చెరుకురు, పేరూరు, కడెకల్, లక్ష్మీపురం తదితర గ్రామల్లో రైతులు జీడి మామిడి సాగుచేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి తోటలు పూత, పిందె దశకు వచ్చి ఏప్రిల్, మేలో చేతికి వస్తాయి. ఈ సమయంలో రైతులు రేయింబవళ్లు తోటలకు కాపాలా ఉండి పండ్లు తెంపి వాటి పిక్కలను వేరుచేసి ఎండబెట్టి ఇక్కడికి వచ్చే వ్యాపారులకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఈ ప్రాంతంలో జీడి మామిడి సంబంధిత ఫ్యాక్టరీలు లేకపోవడంతో జంగారెడ్డిగూడెం, రాజమండ్రి తదితర ప్రాంతాల వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. ఈ సంవత్సరం జీడి మామిడి దిగుబడులు బాగానే ఉన్నా గిట్టుబాటు ధర వస్తుందో? రాదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.