వాజేడు, ఏప్రిల్ 15 : ఎప్పటిలాగే గిరిజనులకు బతుకుదెరువు చూపేందుకు ఇప్పపూల సేకరణ షురువైంది. ఎండాకాలంలో మిరప కోతల తర్వాత ములుగు జిల్లాలోని వాజేడులో గిరిజనులు ఎక్కువగా ఇప్పపూల సేకరణపై ఆధారపడుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సేకరించే పనిలో నిమగ్నమై బుట్టల్లో ఇళ్లకు తెచ్చుకుంటారు. ప్రత్యేకంగా ఎండబెట్టి, బల్లలతో కోట్టి ఈకాలు తీస్తారు. తర్వాత ఆకుల్లో చుట్టి, గంపల్లో పెట్టి తొక్కుతారు. మంచి రేటు వచ్చిన తర్వాత గిరిజన సహకార సంస్థ స్టోర్లలో లేదా బయటవారికి అమ్ముకుంటారు. ఇప్పపూలతో పలువురు గిరిజనులు సహజసిద్ధమైన ఇప్పసారా తయారు చేసుకుంటారు. కొన్ని ఆలయాల్లో ఇప్పపూలను ప్రసాదంగా పెడతారు. ఇప్పకాయల నూనెను వంటలో వాడుకుంటారు. దేవుడి పూజకు సైతం వినియోగిస్తారు. ఇప్పనూనెతో మర్దన చేస్తే ఒళ్లు నొప్పులు, పలు రకాల వ్యాధులు నయమవుతాయని భావిస్తుంటారు. గతంలో కిలో ఇప్పపూలు రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.30 చొప్పున చెల్లించి సేకరిస్తున్నట్లు జీసీసీ మేనేజర్ దేవ్ తెలిపారు.