సుబేదారి, ఏప్రిల్ 15 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుట్కా మాఫియా నయా దందాకు తెరలేపింది. నగరంలో ముందస్తుగా పాన్ షాపులు, కిరాణా దుకాణాల యజమాల నుంచి ఆర్డర్లు తీసుకుని, అనుమానం రాకుండా ఖరీదైన బ్యాగుల్లో ఆర్టీసీ బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. ఇక్కడి నుంచి యాచకుల గుడిసెల్లో డంపు చేస్తున్న ముఠాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ కథనం ప్రకారం.. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతానికి చెందిన దుబ్బా విక్రమ్ హైదరాబాద్ మీర్‌పేట కేంద్రంగా గుట్కా దందా నడిపిస్తున్నాడు.
ఇతడు వరంగల్ నగరంలో పాన్‌షాపులు, కిరాణా దుకాణాల నుంచి గుట్కా ఆర్డర్లు తీసుకుని, హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన చిగల రమేశ్ అలియాస్ రాములు నుంచి పొగాకు ఉత్పత్తులు సేకరిస్తున్నాడు. తర్వాత విక్రమ్ బ్యాగుల్లో వరంగల్, నల్గగొండ, హైదరాబాద్ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా తరలిస్తున్నాడు. అక్కడి నుంచి యాచకుల గుడిసెల్లో పెద్ద ఎత్తున డంపు చేసి, పాన్ షాపులు, కిరాణాలకు సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారంతో విక్రమ్, రమేశ్‌ను అరెస్టు చేసి, రూ.10.69 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈకేసులో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీనివాస్‌జీ, సంతోష్, సిబ్బందిని అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అభినందించారు.