వరంగల్, ఏప్రిల్ 15 : చారిత్రక నగరంలోని భద్రకాళి దేవాలయం వెనుకవైపు బండ్‌ను సుందరంగా తీర్చిదిద్దారని, భద్రకాళి మినీబండ్ నగరానికి మరో మణిహారంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం భద్రకాళి ఆలయం వెనుక వైపు గ్రేటర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన మినీ బండ్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి దయాకర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 2.10 కోట్లతో 570 మీటర్ల భద్రకాళి బండ్‌ను అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందని అన్నారు. దేవాలయానికి వచ్చే భక్తులు ఆహ్లాదంగా గడిపేలా పచ్చదనంతో బండ్ ఆకట్టుకుంటున్నదని ఆయన అన్నారు. వరంగల్ అంటేనే భద్రకాళి అని పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలోనే భద్రకాళి దేవాలయం అభివృద్ధి చెందుతోందని వివరించారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు, భక్తులను ఆకట్టుకునేలా భద్రకాళి మినీబండ్ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. కోట్లాది రూపాయలతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రేటర్ వరంగల్ టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇప్పటికే భద్రకాళి దేవాలయ మాడవీధుల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు. ఆలయంలో భక్తుల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంతో రూ.వందల కోట్ల నిధులతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
పోతన డిజిటల్ మ్యూజియం ప్రారంభం
గ్రేటర్ 11వ డివిజన్ పరిధిలోని పోతన సంగీత నృత్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోతన డిజిటల్ మ్యూజియాన్ని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి పారంభించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోటి రూపాయల నిధులతో పోతన డిజిటల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. పోతన భాగవతం అంతా డిజిటలైజేషన్ చేశారు. విద్యార్థులు, సందర్శకులు పోతన భాగవతం తెలుసుకునేలా డిజిటల్ మ్యూజియాన్ని అభివృద్ధి చేశారు. పోతన భాగవతం తెలుసుకునేందుకు మ్యూజియంలో సుమారు 10 స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, ఇన్టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కుడా ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, అధికారులు పాల్గొన్నారు.