శాయంపేట, ఏప్రిల్ 9: మండల కేంద్రంలోని మత్స్యగిరి ఆలయం వద్ద రాములోరి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ సామల భిక్షపతి సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీరాముడు, సీతాదేవి వివాహం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయంలో భజన, రామాయణంపై క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కోలాటంతో తలంబ్రాలను తీసుకురావడం జరుగుతుందన్నారు. 11 గంటల నుంచి ధార్మిక ఉపన్యాసం ఉంటుందని తెలిపారు. సౌమిత్రి వేణుమాధవాచార్యులు ఆధ్వర్యంలో కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆలయంలో అన్నదానం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో లెక్కల జలేందర్‌రెడ్డి, జిన్నా ప్రతాప్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకటయ్య, సురేష్, సుబ్రహ్మణ్యం ఉన్నారు. మండల పరిధిలోని మాందారిపేట, ఇతర గ్రామాల్లోని ఆలయాల్లోనూ సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.
దామెర : కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవానికి పూర్తి చేసినట్లు టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, దామెర మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోలం కృపాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. గంకిడి శ్రీధర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వార్డుసభ్యులు మేరుగు సంపత్, అర్చకులు సుబ్బయ్యశర్మ పాల్గొన్నారు.
ఐనవోలు: మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఉప ఆలయమైన ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లను శనివారం ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యుడు మునిగాల సంపత్‌కుమార్, ఈవో నాగేశ్వర్రావు, సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఎంపీటీసీ కొత్తూరి కల్పన మధుకర్, అర్చకులు పరిశీలించారు. పున్నేల్ గ్రామం లో వైష్ణవాలయం, పంథిని గ్రామంలో ప్రసన్న ఆంజనేయస్వామి, శివాలయం, కొండపర్తి వేణుగోపాల స్వామిగుడి, కక్కిరాలపల్లి లక్ష్మినర్సింహస్వామి ఆలయం, నందనం ఆంజనేయస్వామి ఆలయం, వెంకటాపురం గ్రామ శివారులోని అశోక్‌నగర్, పెరుమాండ్లగూడెంలలో ఏర్పాట్లు చేశారు.