కాళేశ్వరం, ఏప్రిల్ 9 : కాళేశ్వరం పుష్కర శోభ సంతరించుకుంది. ఈ నెల 13నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయం సరికొత్తగా ముస్తాబవుతోంది. అటు గోదావరి తీరం వద్ద పుష్కరఘాట్‌తో పాటు ఆలయంలో భక్తులు దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. 24వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగనుండగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశముంది. ఈక్రమంలో భక్తులెవరికీ ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించడంతో వెలుగులతో ధగధగా మెరిసిపోతోంది.
భక్తులకు ఇబ్బంది రావద్దు
– ప్రత్యేకాధికారి శ్రీకాంత్‌రావు
పుష్కరాల సందర్భంగా కాళేశరం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని వరంగల్ దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌రావు అన్నారు. కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కర ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. పుష్కరఘాట్ వద్దకు వెళ్లడంతో పాటు ఆలయంలో క్యూలైన్ నిర్మాణ పనులను పరిశీలించి ఈవో మహేశ్‌కు సూచనలు చేశారు.