వరంగల్ చౌరస్తా, మార్చి 16: జిల్లాలో కార్బ్వాక్స్ కోవిడ్ టీకా వేయడం బుధవారం ప్రారంభమైంది. 12 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించారు. తొలిరోజు రాయపర్తి, వర్ధన్నపేట, అలంకానిపేట, చెన్నారావుపేట, సంగెం, ఆత్మకూర్ ఆరోగ్య కేంద్రాల్లో 98 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేశారు. ఫస్ట్ డోసు వేసుకున్న 28 రోజులకు రెండో డోసు వేసుకోవాలని, ఆతర్వాత 39 వారాలకు ప్రికాషనరీ డోస్ తీసుకోవాలని ఇమ్యూనైజేషన్ అధికారి ప్రకాశ్ సూచించారు. జిల్లాలో 12 నుంచి 14 ఏళ్ల పిల్లలు 23వేల 321 మంది ఉండగా, వారిలో 12వేల 292 మంది బాలురు, 11వేల 029 మంది బాలికలు ఉన్నట్లు వివరించారు. గరిష్టంగా రాయపర్తి పరిధిలో 1,825 బాలురు, 1,805 బాలికలు ఉండగా, కనిష్టంగా అలంకానిపేటలో ఆరోగ్య కేంద్రం పరిధిలో 89 మంది బాలురు, నర్సంపేట పీపీపీ యూనిట్ కేంద్రం పరిధిలో 146 బాలికలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం జాతీయ ఇమ్యూనైజేషన్ డే నిర్వహించి, కరోనా వ్యాక్సినేషన్ విధులు నిర్వర్తించిన ఒక ఆరోగ్య కార్యకర్తకు, ఇద్దరు ఆశావర్కర్లను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు.
అర్బన్ హెల్త్ సెంటర్ సందర్శించిన కార్పొరేటర్లు
ఖిలావరంగల్ : ఖిలావరంగల్ పడమర కోటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో బుధవారం 12 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు. 37, 38, 41వ డివిజన్ల కార్పొరేటర్లు బోగి సువర్ణ, బైరబోయిన ఉమ, పోశాల పద్మ అర్బన్ హెల్త్ సెంటర్‌ను సందర్శించారు. డాక్టర్లు దిలీప్, శ్రీదేవి పాల్గొన్నారు.
అర్హులైన పిల్లలందరికీ వేయించాలి
పోచమ్మమైదాన్ : అర్హులైన పిల్లందరికీ తల్లిదండ్రులు కార్బ్వాక్స్ కోవిడ్ టీకా వేయించాలని 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ ప్రకాశ్ అన్నారు. వరంగల్ దేశాయిపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు కార్బ్వాక్స్ కోవిడ్ టీకా వేసే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ ఈ టీకా తయారు చేసిందని వారు తెలిపారు. మెడికల్ ఆఫీసర్ తంగళ్లపల్లి భరత్‌కుమార్, రవీందర్, పరిశీలకులు అనూష, సూపర్వైజర్ కోర్నెలు,అనిల్, కుమార్ పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
చెన్నారావుపేట : కార్బ్వాక్స్ కరోనా టీకాను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బాదావత్ విజేందర్ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో బుధవారం విద్యార్థుల వ్యాక్సినేషన్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు. అన్ని పీహెచ్సీ, సబ్ సెంటర్లల్లో పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు వైద్యాధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పీహెచ్సీ వైద్యాధికారిణి శ్రీదేవి, స్టాఫ్‌నర్సు స్వరూపరాణి ఉన్నారు.