పర్వతగిరి, మార్చి 16: రైతుమిత్ర సంఘాల సభ్యులందరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. మండలంలోని మల్యాతండా, ఏనుగల్, చింతనెక్కొండ గ్రామాలను బుధవారం సందర్శించారు. మల్యాతండా జీపీని సందర్శించి పల్లె ప్రగతి పనులపై అడిగి తెలుసుకున్నారు. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, పాఠశాలలు, రూర్బన్ పథకం ద్వారా అమలయ్యే పనులను పరిశీంచారు. ఏనుగల్లోని నర్సరీని సందర్శించి మొక్కలు బాగా పెరిగాయని చెప్పారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలను విజిట్ చేశారు. పదోతరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి సమాదానాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం ఏనుగల్ రైతువేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సూర్య చంద్ర రైతు మిత్ర సంఘం సభ్యులతో అవగాహన సమావేశంలో పలు విషయాలను చర్చించారు. చింతనెక్కొండలో అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగున్నాయని మెచ్చుకున్నారు. రూర్బన్ పథకం ద్వారా మంజూరైన ఆరోగ్య ఉప కేంద్రం రైతులకు ఇచ్చిన కూరగాయల పందిళ్లను చూసి లాభాలు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చింతనెక్కొండ పంచాయతీని విజిట్ చేసి జీపీ గోడలపై వేసిన చిత్రాలను చూసి బాగున్నాయని అన్నారు. జీపీ రిజిష్టరులో జీపీ పని తీరు బాగుంది.. ఇలాగే కొనసాగించండి.. అని కలెక్టర్ రాసి సంతకం చేశారు. డీఆర్డీఓ సంపత్‌రావు, ఎంపీడీఓ చక్రాల సంతోష్‌కుమార్, సర్పంచులు సుజాత, సంధ్యారాణి, గటిక సుష్మా, ఎంపీటీసీలు కోల మల్లయ్య, బూక్య భాస్కర్, సుభాషిణి, మౌనిక, నాయకులు ఈర్యానాయక్, నర్సింగం, మహేష్, సతీష్‌రావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బాలరాజు, ఉప సర్పంచ్ దర్నోజు దేవేందర్ పాల్గొన్నారు.
కాపులకనపర్తి రైతువేదిక నాణ్యతపై కలెక్టర్ సీరియస్
సంగెం : కాపులకనపర్తి రైతువేదిక పనుల నాణ్యతపై కలెక్టర్ గోపి సీరియస్ అయ్యారు. మండలంలోని కాపులకనపర్తి, తీగరాజుపల్లి గ్రామాల్లోని రైతువేదికలు, పల్లెప్రకృతివనాలు, వననర్సరీలను బుధవారం కలెక్టర్ తనిఖీలు చేపట్టారు. కాపులకనపర్తి రైతువేదిక పనులు పూర్తికాకపోవటంతోపాటు పగుళ్లు ఏర్పడటంతో చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్ఈఈకి నోటీలు ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ పర్యటనలో పీఆర్ఏఈ రమేష్ లేరు. కాపులకనపర్తి గ్రామంలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీల వద్ద ఆగిన ఆయన వారితో పలు విషయాలు మాట్లాడారు. నాలుగు వారాలు అవుతున్నప్పటికి డబ్బులు రాలేదని కూలీలు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం తీగరాజుపల్లిలోని పల్లెప్రకృతి వనం, వన నర్సరీ, డంపింగ్‌యార్డును పరిశీలించారు. ఈజీఎస్‌లో చేసిన పనులను పరిశీలించారు. జాబుకార్డులు లేని వారికి వెంటనే జారీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. డీఆర్డీఓ ఎం.సంపత్‌రావు, ఎంపీడీఓ మల్లేషం, ఎంపీఓ కొమురయ్య, ఈజీఎస్ ఏపీఓ లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.