గీసుగొండ, మార్చి 16: హోలీ పండుగ రోజు జరిగే కొమ్మాల లక్ష్మీ నర్సింహాస్వామి జాతరకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. వరంగల్ నర్సంపేట ప్రధాన రోడ్డు నుంచి జాతర వరకు రోడ్డు వెడల్పు చేశారు. గ్రామ పంచాయతీ నిధులతో సుమారుగా 500కు పైగా ట్రాక్టర్ ట్రిప్పుల మొరాన్ని రోడ్డుకు ఇరువైపలా పోశారు. గుట్టచుట్టూ, భక్తిప్రభలు, ఎడ్ల బండ్లు తిరుగనున్నందున ప్రైవేట్ వాహనాలు, ఎడ్లబండ్ల కోసం వేర్వేరు రోడ్లు ఏర్పాటు చేశారు. దుమ్ము లేవకుండా రోడ్లపై జీపీ ట్యాకర్లతో నీళ్లు పడుతున్నారు. జాతరలో ఎల్ఈడీ లైట్లతోపాటు 32 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మమునూర్ ఎసీపీ నరేశ్‌కుమార్ ఆధ్వర్యం లో నలుగురు సీఐలు, 18 మంది ఎస్సైలతోపాటు మరో 350 మంది పోలీసులు, సివిల్ పోలీసులు, స్పెషల్‌పార్టీ, క్రైమ్ పార్టీ పోలీసులు, షీ టీమ్‌లు జాతరలో విధుల్లో ఉండనున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్‌రెడ్డి తెలిపారు.
జాతరలో రాజకీయ ప్రభలు నిషేధం : ఈస్టు జోన్ డీసీపీ
కొమ్మాల జాతరలో రాజకీయ ప్రభలు నిషేధమని ఈస్టు జోన్ డీసీపీ వెంకటలక్ష్మీ అన్నారు. బుధవారం హనుమకొండ డీసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ గతంలో గీసుగొండ, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, సంగెం మండలాల నుంచి రాజకీయప్రభలు జాతరకు రావటంతో రాజకీయ గొడవలు జరిగేవని తెలిపారు. దీంతో పోలీసులు ఎనిమిదేళ్లుగా రాజకీయ ప్రభబండ్లను నిషేధించినట్లు తెలిపారు. ఎవరైనా రాజకీయ ప్రభబండ్లను కడితే కేసులు నమోదు చేస్తామన్నారు.