దుగ్గొండి/గీసుగొండ, జనవరి 27: తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతిలో భాగంగా అందజేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. శివాజీనగర్‌లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని గురువారం ఆయన పరిశీలించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి, పారిశుధ్య పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి సర్పంచ్, కార్యదర్శిని అభినందించారు. విలేజ్ పార్కులోని మొక్కలకు నీరందించేందుకు నిర్మించిన బోరుబావికి విద్యుత్ మోటరు కోసం నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ లింగంపల్లి ఉమారవీందర్రావు హరిసింగ్‌ను కోరగా, సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, కార్యదర్శి వినోద్‌కుమార్, ఉపసర్పంచ్ మోర్తాల గణేశ్, లింగంపల్లి రవీందర్రావు, డీ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని కోనాయిమాకుల, మనుగొండ గ్రామాలను హరిసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా రోడ్లకిరువైపులా మల్టీలేయర్ పద్ధతిలో నాటుతున్న మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఈజీఎస్, కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా రోజూ మొక్కలకు నీళ్లు పట్టాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట సర్పంచ్‌లు రాధాబాయి, నమిండ్ల రమ, ఏపీవో మోహన్‌రావు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఈజీఎస్ టీసీ, కార్యదర్శులు ఉన్నారు.
నర్సరీ పనులను త్వరగా పూర్తి చేయాలి
నర్సంపేటరూరల్/పర్వతగిరి: నర్సంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో నర్సరీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్ సూచించారు. గుర్రాలగండిరాజపల్లి, చిన్నగురిజాలలో గురువారం ఆయన నర్సరీల పనులను పరిశీలించారు. నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజాప్రతినిధులు, కార్యదర్శులకు సూచించారు. మొక్కల పెంపకంపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు. సర్పంచ్ తుత్తూరు కోమల, వార్డు సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు. పర్వతగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్షించారు. నర్సరీల నిర్వహణ బాగుండాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను రోజూ నిర్వహించాలన్నారు. నర్సరీలో వనసేవక్ రోజూ ఉద యం, సాయంత్రం నీరు పట్టాలని చెప్పారు. ప్రతి బ్యాగు లో మొక్క ఉండేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. రోడ్లకిరువైపులా నాటిన మొక్కలకు ప్రతి శుక్రవారం నీరు పట్టాలని, ట్రీగార్డులను సరిచేయాలన్నారు. సమీక్షలో ఎంపీవో, కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.