నర్సంపేట, ఫిబ్రవరి 13: నల్లబెల్లి ఎన్‌హెచ్-365 నుంచి దుగ్గొండి మీదుగా గిర్నిబావి వరకు రూ. 15 కోట్ల నిధులతో బీటీ డబుల్‌రోడ్డు మంజూరైనట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్ రోడ్డు నిర్మాణంతో నల్లబెల్లి, దుగ్గొండి మండలాలకు రవాణా సౌకర్యం మెరుగు పడనుందని చెప్పారు. నల్లబెల్లి, దుగ్గొండి మండలకేంద్రాల్లో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ రెండు మండలకేంద్రాల్లో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. ఆయా మండల ప్రజల ఎన్నో ఏళ్ల కల త్వరలోనే సాకారం కానుందని ఆనందం వ్యక్తం చేశారు. మండలకేంద్రాల్లో జంక్షన్ల అభివృద్ధితో రూపురేఖలు మారిపోతాయన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.