వరంగల్, ఫిబ్రవరి 13 (నమస్తేతెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సంబరాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ జిల్లాలోని పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ బర్త్‌డేను పురస్కరించుకుని అరూరి రమేశ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల రాష్ట్ర ఏర్పాటు 60 ఏండ్ల కలను సాకారం చేసి, అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈసారి మూడు రోజులపాటు సంబురంగా నిర్వహించుకుందామని అరూరి పార్టీ శ్రేణులకు సూచించారు. 15న జిల్లా పరిధిలో ఉన్న వైద్యశాలలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో అన్నదానం, పండ్లు, దుస్తుల పంపిణీ కార్యక్రమాలు జరుపాలని కోరారు. 16న జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, కేసీఆర్ పుట్టిన రోజైన 17న సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. ఈ మూడు రోజులపాటు చేపట్టే కార్యక్రమాల్లో జిల్లాలోని పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.