వర్ధన్నపేట, ఫిబ్రవరి 13: పార్టీ కోసం పని చేసే కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా అండగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పట్టణానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బొంత సంతోష్ ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పార్టీ తరఫున ప్రమాద బీమా పథకం కింద అతడికి రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేశ్ హనుమకొండ ప్రశాంతినగర్‌లోని తన స్వగృహంలో బాధిత కుటుంబానికి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న కార్యకర్తల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రమాద బీమా చేయించినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు ఎవరైనా క్రియాశీలక కార్యకర్త మృతి చెందితే వారి కుటుంబానికి పార్టీ తరఫున చేయించిన బీమా ద్వారా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందుతుందని వివరించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అనేక మంది కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము అందించి ఆర్థికంగా చేయూతనందించినట్లు వివరించారు.టీఆర్ఎస్ సభ్యత్వాలు తీసుకున్న కార్యకర్తల్లో ఎవరైనా మృతి చెందితే వెంటనే పార్టీ నాయకులు స్పందించి అతడి పేరున ఇన్సూరెన్స్ డబ్బులు మంజూరయ్యేలా సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో బొంత సంతోష్ కుటుంబ సభ్యులతోపాటు టీఆర్ఎస్ నాయకులు పూజారి రఘు, దేవేందర్‌రెడ్డి, పులి శ్రీనివాస్, నక్క రవి, వడ్డెర సంఘం నాయకులు ముత్యాలు, ఎల్లస్వామి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.