బయ్యారం, ఫిబ్రవరి 22 : ‘బయ్యారం ఉక్కు- తెలంగాణ హక్కు’ అనే నినాదంతో టీఆర్ఎస్ మరో ఉద్యమానికి సిద్ధమైంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్ని వనరులున్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. విభజన చట్టంలో పొందుపర్చినా ఏడేళ్లుగా దాటవేత ధోరణి అవలంబిస్తున్నది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రకటన ఉంటుందని తమకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లుతున్నది. తాజాగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వనదేవతలు సమ్మక్క- సారలమ్మల సాక్షిగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫిజుబులిటీ లేదని తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని ఖరాకండి గా చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణ బిడ్డవై ఉండి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పడానికి నీకు నోరెలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువత నుంచి నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ఉక్కు పరిశ్రమ సాధన కోసం మరో ఉద్యమానికి సిద్ధమైంది. నేడు బయ్యారం బస్టాండ్ సెంటర్లో ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టనున్నారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం తెలంగాణ ప్రజానీకం ఏడేళ్ల నుంచి కళ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నది. విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ర్టానికి చెందిన ఎంపీలతోపాటు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీ, కేంద్రమంత్రిని పలుమార్లు కలిసి విన్నవించారు. దీంతో పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు సర్వేలు నిర్వహించి, బయారం ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి అనువైన ప్రాంతమని ప్రకటించాయి. ఇక్కడి ఇనుప ఖనిజం సరిపోకుంటే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బయిలాడిల్లాలోని ఇనుప ఖనిజాన్ని తీసుకురావొచ్చని, అందుకోసం 120 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఏర్పాటు చేయాలని, ఆ ఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి తెలిపారు. వీటితోపాటు నీళ్లు, విద్యుత్ సౌకర్యం, ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షను పట్టించుకోవడం లేదు. ఏడేళ్లుగా బయ్యారం స్టీల్‌ప్లాంట్ ఊసెత్తడం లేదు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా, బయ్యారంలో స్టీల్ ప్లాంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బయ్యారం మండల కేంద్రంలో బుధవారం ఒక్క రోజు దీక్షకు సిద్ధమైంది. ఎంపీ, టీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందు బస్టాండ్ సెంటర్లో చేపట్టనున్న దీక్షలో పాల్గొననున్నారు. ఇది యుద్ధానికి ఆరంభమేనని, అంతం కాదని వారు ప్రకటించారు. కాగా, దీక్షకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సంఘీభావం ప్రకటించనున్నారు.