జనగామ చౌరస్తా, జూలై 17 : జిల్లా కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో మసురం పుల్లయ్య 92వ జయంతి సందర్భంగా మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలు ఆదివారం ముగిశాయి. హైస్కూల్ స్థాయి విద్యార్థులు 40 మందికి స్పాట్ పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించగా 17 మంది విద్యార్థులు ప్రతిభకనబర్చారు. అనంతరం అతిథుల సమక్షంలో బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు.
నిర్వాహకులకు మున్సిపల్ చైర్పర్సన్ అభినందన
రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహించిన నిర్వాహకులను మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునాలింగ య్య అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగివున్న చిత్రకళను వెలికితీసే ప్రయత్నం చేసిన నిర్వాహకులు పోటీలు నిర్వహించడం మంచి విషయమన్నారు. చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆమె బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు రాజేంద్ర ప్రసాద్, పెట్లోజు సోమేశ్వరాచారి, జీ కృష్ణ, అయిలా సోమనర్సింహాచారి, లగిశెట్టి ప్రభాకర్, సాయి కిరణ్, సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.