ములుగు రూరల్, మార్చి15 : ప్రపంచంలోనే అతి పురాతన కట్టడాల్లో ఒకటైన.. కాంబోడియా దేశంలోని అత్యంత ప్రాచీన అంగ్కోర్వాట్ దేవాలయాన్ని పోలి ఉన్న మన దేవునిగుట్ట జాతరకు ముస్తాబైంది. ములుగు జిల్లా ములుగు మండలం కొత్తూరు దేవునిగుట్టపై పురాతన బుద్ధుడి ఆలయం ఉంది. ఇది దేశంలోని ఆలయాల కంటే అరుదైనదిగా చరిత్రకారులు గుర్తించారు. లేత ఎరుపు రంగు ఇసుక రాతి బండలతో నిర్మించిన ఈ ఆలయం వెలుపల, బయట బుద్ధుడి విగ్రహాలతో పాటు ఆలయం వెనుక అర్ధనారీశ్వర విగ్రహం దర్శనమిస్తుంది. కీకారణ్యంలో ఉన్న ఈ ఆలయాన్ని నాటి కాలంలో శిల్పి ఒక్కో బండపై విగ్రహాలు చెక్కి కూర్చి నిర్మించడం విశేషం. గుట్ట మీద పునాదులు లేకుండా తొమ్మిది అడుగుల మందంతో రెండు పొరలుగా గోడలు నిర్మించిన తీరు అద్భుతం. ఆలయం నలువైపులా రాతి గుండ్లతో పేర్చిన గోడ, ఉత్తరం వైపు సహజసిద్ధంగా ఏర్పడిన చెరువు, మూలన పాలరాతి స్తంభం బౌద్ధస్తూపాలను నిలిపి ఉంచే ఆయక స్తంభం దానికి నలువైపులా అర్ధ పద్మాలు, సింహాలు చెకిన శిల్పాలు చూడముచ్చటగా కనిపిస్తాయి. తూర్పు ముఖంగా ఒకే చిన్న ద్వారం, దానికి ఇరువైపులా ద్వారపాలకుల్లా వజ్రాయాన బౌద్ధమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. వీరిలో ఒకరు హరి వాహన లోకేశ్వరుడు కాగా లోపలి గోడలపై బౌద్ధ జాతక కథల శిల్పాలు అబ్బురపరుస్తున్నాయి రెండు మూడుచోట్ల బుద్ధుడు శిష్యులకు బోధిస్తున్న దృశ్యాలు, ఒకచోట యుద్ధ సన్నివేశం, దక్షిణం వైపు గోడపై బోధిసత్వుడు, పడమటి వైపు గోడపై అర్ధనారీశ్వర శిల్పం, దానిపై వరుసలో బుద్ధుని బోధనలు వింటున్న రాజు, రాణులు, పరివారం, మిథునాలు, ఉత్తరం వైపు గోడపై పెద్ద తలకాయతో భయంకర ఆకారంలో బోధిసత్వుడి విగ్రహం ఉన్నాయి. ఇక్కడి శిల్పాలకు అజంతా, అమరావతి, ఫణిగిరి, నాగార్జునకొండ, సంధగిరి, ఉదయగిరి శిల్పాలతో పోలికలు కనిపిస్తాయి.
11 ఏళ్లుగా జాతర
గుడిలోపల విగ్రహం లేని ఈ ఆలయంలో కొత్తూరు గ్రామస్తులు 60 ఏళ్ల నుంచి వరదపాశంతో మొక్కులు చెల్లిస్తూ వస్తున్నారు. 2012లో లక్ష్మీనర్సింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఏటా కాముని పౌర్ణమి ముందు జాతర నిర్వహిస్తున్నారు. 11 ఏళ్లుగా గుట్టపై నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించడంతో పాటు వర్షాకాల ప్రారంభంలో పాలు, బియ్యం, బెల్లంతో గుట్టపై వరదపాశం పోసి పూజలు చేస్తున్నారు. ఏటా జాతరకు ములుగు జిల్లానుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు. అంకురార్పణ పూజలతో నేడు జాతర ప్రారంభం కానుండగా, 17న లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం, 18న హోమం, పూర్ణాహుతి, మొక్కులు, 19, 20న ధ్వజస్తంభం గ్రామోత్సవం, 21న ధ్వజస్తంభం ప్రతిష్ఠ, గరుడ ముద్ద ఉత్సవం, శాంతికల్యాణం, కోడెలు, బండ్ల ప్రదక్షిణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.