వరంగల్, డిసెంబర్ 21: నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో బుధవారం ఆమె ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అధికారులతో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ పుష్పతో కలిసి సమీక్షించారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న 18 ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఆధునీకరించడంతోపాటు అదనంగా నాలుగు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పాదచారుల కోసం జీబ్రా లైన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. జంక్షన్లను అభివృద్ధి చేయడంతోపాటు మహా నగరంలో ప్రధాన రహదారుల మధ్య డివైడర్లు ఏర్పాటు చేయాలన్నారు.
పోలీస్ కమిషనరేట్ జంక్షన్ నుంచి కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వరకు ఉన్న సెంట్రల్ మీడియం ఎత్తును పెంచాలని ఆమె అధికారులను ఆదేశించారు. నగరంలో పచ్చదనం పరిఢవిల్లాలన్నారు. పచ్చదనం కోసం ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు, బల్దియా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అక్కడ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. సెల్లార్లను పార్కింగ్ కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ ఎన్పవర్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించాలన్నారు. రోడ్డు పక్కన చిరువ్యాపారాలను తొలగించాలని కోరారు. భారీ వాహనాలు నగరంలోని రాకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో బల్దియా ఎస్ఈ ప్రవీణ్‌చంద్ర, సీహెచ్‌వో శ్రీనివాసరావు, ఈఈ సంజయ్‌కుమార్, డిప్యూటీ టౌన్‌ప్లానింగ్ అధికారి ప్రకాశ్‌రెడ్డి, ఏసీపీ బషీర్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.