వెంకటాపూర్, డిసెంబర్ 10 : కాకతీయుల కళా వైభవం, సంస్కృతీ సంప్రదాయాలకు నెలవు రామప్ప ఆలయం. గత పాలకుల నిర్లక్ష్యంతో నాటి ఘనకీర్తి మరుగునపడిన నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకువచ్చారు. రామప్ప ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉండగా మిగతా ఉప ఆలయాల పరిరక్షణ, పునర్నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు కేటాయించింది. ప్రధాన ఆలయ ఆవరణలోని కామేశ్వరాలయం, ప్రహరీ పనులను కేంద్ర పురావస్తు శాఖ, మిగతా ఐదు ఉప ఆలయాల పనులను రా్రష్ట్ర శాఖ పర్యవేక్షిస్తున్నది. అలాగే జాకారం, రామంజాపూర్, బుస్సాపూర్ల్లోని ఆలయాల అభివృద్ధికీ నిధులు మంజూరు కాగా, త్వరలో టెండర్లు పిలిచి పురాతన కట్టడాల నిర్మాణ పద్ధతిలో యునెస్కో నిబంధనలకు అనుగుణంగా పనులు ప్రారంభించనున్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట రామప్ప ఉపాలయాల పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అడుగులు పడుతున్నాయి. ప్రధాన అలయం ప్రాంగణంలోని కామేశ్వరాలయం, ప్రహరీ పనులు కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపడుతుండగా, రామప్పకు పశ్చిమ భాగంలోని కాలభైరవుడి ఆలయం, సరస్సు బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న శివాలయం, హరిత హోటల్ పక్కన ఉన్న త్రికూటాలయం దాని పక్కన మరో రెండు ఆలయాలను రా్రష్ట్ర పురావస్తు శాఖ పునర్నిర్మించనుంది. అంతేకాకుండా వాటి చుట్టూ ప్రహారీ ఏర్పాటుచేయనున్నారు.
కాకతీయుల కట్టడాలకు పూర్వవైభవం
కాకతీయుల అనంతరం ఆలయాల పోషణ, రక్షణ చర్యలు లేకుండా పోగా పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ గులాం యజ్దానీ కాలంలో ఆలయాలు పడిపోకుండా సపోర్ట్(ఆధార) స్తంభాలను కట్టించి శిథిలావస్థకు చేరకుండా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పురాతన ఆలయాల రక్షణ, పునర్నిర్మాణాలు, అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఘనకీర్తి ఉన్న రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చారు. ఈ ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉండగా మిగతా ఉప ఆలయాల పరిరక్షణ, పునర్నిర్మాణం కోసం రా ష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు కేటాయించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీ టీకే శ్రీదేవి, కలెక్టర్ కృష్ణఆదిత్య, రా్రష్ట్ర పురావస్తు, టూరిజం శాఖల అధికారులతో కలి సి ఉప ఆలయాలను సందర్శించారు. పనులు ఏ విధంగా చేపట్టనున్నారో తెలుసుకున్నారు.
కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కామేశ్వరాలయం, ప్రహరీ పనులు
రామప్ప ప్రధానాలయ ప్రాంగణంలోని కామేశ్వరాలయంతో పాటు ప్రహరీ, ఆలయ ప్రాంగణంలో అంతర్గత రహదారులు, ఇటుకలతో గోడలు(బ్రిక్ కెర్బ్), అలంకరణ పనులను కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. యునెస్కో నిబంధనల మేరకు పూర్తిగా పురాతన పద్ధతిలో డంగు సున్నంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే దక్షిణ-ఆగ్నేయ దిశలోని ప్రహరీ పనులు ప్రారంభించగా, ఈశాన్య-తూర్పుభాగంలోని ప్రహరీ పనులు త్వరలో చేపట్టనున్నారు. కామేశ్వరాలయ పనులను నిట్ నిపుణుల సూచన మేరకు పనులను చేపట్టనున్నారు.
యునెస్కో నిబంధనల మేరకు పనులు
రామప్పలోని ఐదు ఉప ఆలయాలతో పాటు జాకారం, రామంజాపూర్, బుస్సాపూర్ గ్రామాల్లోని కాకతీయుల ఆలయాల పునర్నిర్మాణ పనులు చుట్టూ రక్షణ కోసం డ్రిల్స్‌తో కంచె ఏర్పాటు చేయనున్నారు. రామప్ప చెరువు బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న ఆలయానికి రూ.5.5 కోట్లు, హరిత హోటల్ పక్కన ఉన్న త్రికూటాలయానికి రూ.2.50 కోట్లు, దాని పక్కనే ఉన్న రెండు ఆలయాలకు రూ.2 కోట్లు, రామప్ప ఆలయానికి పశ్చిమాన ఉన్న ఆలయానికి రూ.1,50 కోట్లు, త్రికూటాలయం చుట్టూ ప్రహరీకి రూ.50 లక్షలు, రామంజపూర్ గ్రామంలోని నాంచారమ్మ ఆలయ ప్రహరీకి రూ.40 లక్షలు, జాకారం శివాలయం పునర్నిర్మాణానికి రూ.1.50 లక్షలు, గ్రిల్స్‌తో ప్రహరీకి రూ.25 లక్షలు, బుస్సాపూర్ ఆలయానికి గ్రిల్స్‌తో ప్రహరీకి రూ.40 లక్షలు, ఆలయాల సైన్బోర్టులు, చరిత్ర బోర్డులు, డైరెక్షన్ బోర్డులకు రూ.45 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటికి త్వరలో టెండర్లు పిలిచి నిర్మాణ పనులు పూర్తిగా పురాతన పద్ధతిలో యునెస్కో నిబంధనల మేరకు చేపట్టనున్నారు.