వరంగల్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ):జిల్లాలో జనవరి 18 నుంచి రెండో విడుత కంటి వెలుగు నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. 100 పనిదినాల్లో ప్రతి రోజూ అర్బన్‌లో 400, రూరల్‌లో 300 మంది కంటి పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఔట్సోర్సింగ్ ద్వారా 44 మంది ఆప్తాల్మిక్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. వైద్య అధికారులు, సిబ్బందికి త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. శిబిరాల కోసం గ్రామాలు, వార్డులు, డివిజన్లు, జనాభాను గుర్తించి జాబితాలను రూపొందిస్తున్నారు. కంటి వెలుగు నిర్వహణ ఏర్పాట్లపై కొద్దిరోజుల క్రితం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు వైద్యశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కంటివెలుగు రెండోవిడుత కార్యక్రమ నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు. కంటిపరీక్షలు చేసేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తున్నారు. ఔట్సోర్సింగ్ పద్ధతిన ఇప్పటికే 44 ఆప్తాల్మిక్ పోస్టులకు ఎంపిక పూర్తి చేశారు. గత బుధవారం వీరికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ నియామక పత్రాలను అందజేశారు. ఆప్తాల్మిక్ అధికారులతోపాటు కంటి పరీక్షలు నిర్వహించే ప్రత్యేక బృందాల్లోని వైద్య అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదట ఆప్తాల్మిక్ అధికారులు హైదరాబాద్‌లోని సరోజినీదేవి, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రుల్లో త్వరలో ఒక్క రోజు శిక్షణ పొందనున్నారు.
ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు, అవసరమైతే కళ్లద్దాలను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 15న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక బృందాలతో గ్రామాలు, పట్టణాల్లో నేత్ర శిబిరాలు నిర్వహించింది. జిల్లాలో వైద్య అధికారులు తమ సిబ్బందితో కలిసి 3,24,644 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 52,718 మందికి రీడింగ్ గ్లాసులను పంపిణీ చేశారు. ఈ కళ్లద్దాలను పొందిన లబ్ధిదారుల్లో 40 ఏళ్లకు పైబడిన వారు 43,451, 40 ఏళ్లలోపు వారు 9,267 మంది ఉన్నారు. కంటి పరీక్షలు పూర్తయిన లబ్ధిదారుల్లో 44,122 మందికి దూరపుచూపు అద్దాలు ప్రిస్కిప్షన్(ఆర్డర్) గ్లాసులు అవసరమని శిబిరాల్లో వైద్యులు గుర్తించారు. వీరిలో 32,250 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసులను కూడా అందజేశారు. 2019 మార్చి వరకు తొలివిడుత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగింది. ఆ తర్వాత కరోనాతో అత్యధికంగా పెరిగిన సమస్యల్లో కంటిచూపు ఒకటని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆన్లైన్ చదువులతో పిల్లల్లో కంటి సమస్య ఎక్కువగా పెద్దల్లో బ్లాక్ ఫంగస్‌తో కంటి జబ్బులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2023 జనవరి 18 నుంచి రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 18న రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు రెండోవిడుత ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపి ప్రభుత్వం నుంచి తాజాగా అనుమతులు పొందారు.
కంటి పరీక్షలకు 44 బృందాలు
జిల్లాలో రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమాన్ని 44 బృందాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు జనవరి 18 నుంచి రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం 44 బృందాలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి బృందంలో మెడికల్ ఆఫీసర్, ఆప్తాల్మిక్ ఆఫీసర్, సూపర్వైజర్, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌తోపాటు ముగ్గురు ఆశ వర్కర్లు ఉంటారు. తొమ్మిది మందితో కూడిన ఒక్కో బృందం ఏఆర్ మిషన్ సాయంతో కంటివెలుగు శిబిరాల్లో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించనుంది. మందులతోపాటు అవసరమైన లబ్ధిదారులకు రీడింగ్ గ్లాసులు, ప్రిస్కిప్షన్ గ్లాసులను పంపిణీ చేస్తారు. ప్రస్తుతం మెడికల్ ఆఫీసర్లతోపాటు హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆశవర్కర్లు అందుబాటులో ఉన్నందున పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిన 44 మందిని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నియమించారు.
ఈ బృందాల్లో పనిదినాల్లో రోజూ రూరల్‌లో 20, అర్బన్‌లో 20 బృందాలు కంటి పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఈ లెక్కన రోజూ అర్బన్‌లో 400, రూరల్‌లో 300 మంది చొప్పున అంటే మొత్తం 700 మందికి కంటి పరీక్షలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. జనవరి 18 నుంచి ఆరు నెలల వ్యవధిలో వంద పనిదినాల్లో నిర్దేశిత లక్ష్యం ప్రకారం నేత్ర శిబిరాలు నిర్వహించి మందులు, కళ్లద్దాలను అందజేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమంలో విధులు నిర్వర్తించే 44 బృందాల్లోని వైద్య అధికారులు, సిబ్బందికి జిల్లా స్థాయిలో నేత్ర శిబిరాలు, కంటి పరీక్షల నిర్వహణ, మందులు, కళ్లద్దాలు, ఇతర అంశాలపై త్వరలో శిక్షణ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. జనవరి 18 నుంచి నేత్ర శిబిరాల నిర్వహణ కోసం గ్రామాలు, వార్డులు, డివిజన్లు, జనాభాను గుర్తించి జాబితాలను రూపొందిస్తున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహణపై కొద్దిరోజుల క్రితం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి హరీశ్‌రావు వైద్యశాఖ అధికారులతో సమీక్ష చేశారు. సమన్వయంతో విజయవంతం చేయాలని ఆదేశించారు.