ఖిలావరంగల్, డిసెంబర్ 5 : ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ బీ గోపి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో అధికారులు, మిల్లర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా కొనుగోళ్లు చేయాలన్నారు. అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పని చేస్తేనే ధాన్యం కొనుగోళ్లు ప్రణాళిక ప్రకారం పూర్తి అవుతాయన్నారు.
గ్రీవెన్స్‌కు 76 దరఖాస్తులు..
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 76 మంది కలెక్టర్‌కు దరఖాస్తులు అందజేశారు. వరంగల్ మండలం కొత్తపేట గ్రామంలోని సర్వే నంబర్ 231లోని 5.12 ఎకరాల భూమి కోర్టు కేసులో ఉందని, దానిని ఎవరి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదని కోరుతూ గీత పారిశ్రామిక సంఘం బాధ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. భూ సంబధించిన 26, విద్యా, ఎంజీఎం, ఎస్సీ కార్పొరేషన్, డీఆర్డీవో , డీడబ్ల్యూవో, పోలీస్ కమిషనర్, జీవనోపాధి, వ్యవసాయం తదితర సమస్యలను పరిష్కరించాలని ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ కోట శ్రీవత్స, ఆర్డీవో మహేందర్‌జీ, డీఆర్డీవో సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.