రఘునాథపల్లి నవంబర్ 30 : మం డల కేంద్రానికి చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రఘునాథపల్లి గ్రామ పంచాయతీకి చెందిన పేర్నే మల్లేశ్ ఇంటి అనుమతుల మ్యుటేషన్ చేసే విషయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్‌ను కలువగా లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బుధవారం పంచాయతీ కార్యదర్శి సంతోష్‌కు రూ.4500 లంచం ఇస్తుండగా ఏసీబీ వరంగల్ డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో అవినీతికి సహకరించిన వాటర్‌మెన్ నగేశ్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇళ్ల నిర్మాణంలో అనుమతుల కోసం సంతోష్ డబ్బులు ఇవ్వాలని వేధించేవారని బాధితుడు మల్లేశ్ వివరించారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ బాధితుడు మల్లేశ్ 30 ఆగస్టు 2021న మీ సేవ కేంద్రంలో తన తండ్రి పేరున ఉన్న ఇంటిని తన పేరుకు మార్చాలని రూ.970 చెల్లించాడు. అయినప్పటికీ మ్యుటేషన్కాలేదు. ఈ నెల 23న మల్లేశ్ కార్యదర్శ సంతోష్ వద్దకెళ్లి మా పని పెండింగ్‌లోనే ఉంది సార్ అని అడుగగా రూ.5,090 చెల్లిస్తే పని పూర్తవుతుందని చెప్పాడు. రూ.4500 ఇస్తానని ఒప్పుకున్నా అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకరావడంతో పక్కా ప్లాన్ ప్రకారం లంచం తీసుకుంటున్న సంతోష్, నగేశ్‌ను పట్టుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసిన్నట్లు సుదర్శన్ తెలిపారు.