నకిరేకల్, నవంబర్ 20: నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లిలో మూడు రోజులుగా నిర్వహించిన బాలికల సీనియర్ 51వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీలో పాల్గొన్న 8 జట్లలో ఏ-గ్రూప్ లో 4, బీ-గ్రూపులో 4 జట్ల చొప్పున లీగ్ పద్ధతిలో పోటీలు జరిగాయి. మొదటి బహుమతి వరంగల్ జిల్లా జట్టు కైవసం చేసుకోగా, రెండో బహుమతిని హైదరాబాద్ జిల్లా జట్టు అందుకుంది. మూడో బహుమతి నల్లగొండ జిల్లా జట్టు, నాలుగో బహుమతి ఖమ్మం జిల్లా జట్టులు కైవసం చేసుకున్నాయి. గెలుపొందిన విజేతలకు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బహుమతులు ప్రదానం చేశారు. మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ముగింపు సమావేశంలో ఎంపిపి బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు, జెడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేష్, మండలపార్టీ అధ్యక్షులు, స్థానిక సర్పంచి ప్రగడపు నవీన్‌రావు, మున్సిపల్ ఛైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రదీప్‌రెడ్డి, పిఎసిఎస్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, వనపర్తి రమేష్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.