గోవిందరావుపేట/వెంకటాపూర్, నవంబర్20: పర్యాటక ప్రాంతాలైన లక్నవరం సరస్సు, రామప్ప ఆలయం టూరిస్టులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వేలాడే వంతెనలపై నడుస్తూ సరస్సు అందాలను తిలకించారు. సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు. ఆ తర్వాత బోటులో షికారు చేస్తూ ప్రకృతిని ఆస్వాదించారు. దీంతో లక్నవరం పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయానికి పలు జిల్లాలతో పాటు వివిధ రాష్ర్టాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు, పర్యాటకులు తరలిచ్చారు. ఆలయ విశిష్టతను టూరిజం గైడ్స్ ద్వారా తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరుడికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. మామిడి, మారేడు చెట్ల వద్ద మహిళలు దీపాలు వెలిగించారు. అనంతరం రామప్ప సరస్సుకు చేరుకొని పర్యాటక శాఖ వారి బోట్లలో బోటింగ్ చేశారు.
కొనసాగుతున్న హెరిటేజ్ ఉత్సవాలు
హెరిటేజ్ ఉత్సవాల్లో భాగంగా రామప్ప గార్డెన్లో భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను విద్యార్థులు, పర్యాటకులు తిలకించారు. నేడు పురావస్తు శాఖ సూపరింటెండెంట్ స్మిత ఎస్ కుమారి ఆదేశానుసారం రామప్పలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని సీఏ మల్లేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.