రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుండడంతో వరంగల్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు సమీప ప్రాంతాల్లోనూ ఇప్పుడు రవాణా, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో శివారులో ఉన్న నివాస స్థలాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన వెంచర్లలోని ప్లాట్లకు మంచి రేట్లు వస్తున్నాయి. ఈనెల 13న మడిపల్లిలోని మా సిటీలో కుడా నిర్వహించిన వేలానికి విశేష స్పందన వచ్చింది. అత్యధికంగా గజానికి రూ.17,050 ధర పలికింది. రెండు దశల్లో 52 ప్లాట్లను విక్రయించగా రూ.14 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. వెంచర్ల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న కుడా నగరాభివృద్ధిలో భాగస్వామి అవుతోంది.
వరంగల్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలతో గ్రేటర్ వరంగల్ నగరం కొత్త దిశగా ముందుకు సాగుతున్నది. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో వరంగల్ మహానగరం నివాస యోగ్యమైన ప్రాంతంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ)తోపాటు దీని చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ ఇప్పుడు రవాణా, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన పూర్తి స్థాయిలో ఉన్నది. ఈ నేపథ్యంలో జీడబ్లూఎంసీ శివారు ప్రాంతాల్లోని నివాస స్థలాలకు మంచి ధరలు పలుకుతున్నాయి. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) చేపడుతున్న వెంచర్లకు అత్యధిక డిమాండ్ ఉంటున్నది. ప్రైవేట్ రియల్టర్ల కంటే ఎక్కువ డిమాండ్ కుడా ప్లాట్లకు ఉంటున్నది. కుడా ఆధ్వర్యంలో ఈనెల 13న చేపట్టిన కొత్త వెంచర్‌లోని ప్లాట్లకు అత్యధిక ధరలు పలికాయి. జీడబ్ల్యూఎంసీ నగర శివారులోని మడిపల్లిలో మాసిటీ పేరుతో కుడా ఏర్పాటు చేసిన వెంచర్లో అత్యధికంగా గజానికి రూ.17,050 ధర పలికింది. రెండు దశల్లో చేపట్టిన మాసిటీ వేలంలో 52 ప్లాట్లను విక్రయించారు. రూ.14 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. మాసిటీలో అనుకున్న దాని కంటే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గతంలో చేపట్టిన ఓసిటీ వెంచర్‌లోనూ గరిష్ఠ ధరలు పలికాయి. వరంగల్ నగరంలోని ప్రధాన ప్రాంతంలో 117 ఎకరాల్లో ఓసిటీ పేరుతో కుడా వెంచర్ చేసింది. నగరంలోని వ్యాపారులు, ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు దీంట్లో ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పటికి 12 దశల్లో ఈ వెంచర్లో ప్లాట్లను వేలం వేశారు. అత్యధికంగా గజానికి రూ.60 వేల చొప్పున ధర పలికింది. ఓసిటీ వెంచర్‌తో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు రూ.300కోట్ల వరకు ఆదాయం వచ్చింది. కుడా ఆధ్వర్యంలో చేపట్టిన వెంచర్లకు ప్రజల నుంచి ఎక్కువ స్పందన వస్తున్నది.
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ప్రభుత్వ పరిధిలోని సంస్థ. దీంతో ఈ ప్లాట్లపై భరోసా ఉంటున్నది. కుడా చేపడుతున్న వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపుతున్నారు. ఇతర దేశాల్లో కష్టపడి సంపాదిస్తున్న డబ్బుతో సొంత ప్రాంతంలో కుడా భూములను నమ్మకంగా కొనుగోలు చేస్తున్నారు. ఎన్ఆర్ఐలు పోటీ పడుతుండడంతో కుడా వెంచర్లకు ధర ఎక్కువగా పలుకుతున్నది.
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఆధ్వర్యంలోని వెంచర్లతో వచ్చే ఆదాయాన్ని వరంగల్ మహానగరంలోని వసతుల కల్పనకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో వరంగల్ మహానగరంలోని కుడా వివిధ పనులు చేస్తున్నది. ఓసిటీ వెంచర్లో వచ్చిన రూ.300 కోట్లతో గ్రేటర్ వరంగల్‌లోని ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేసింది. వరంగల్ మహానగర పరిధిలోని మెయిన్ రోడ్లకు ఇరువైపులా అందంగా తీర్చిదిద్దింది. కాకతీయుల కాలం నాటి చారిత్రక ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసింది. చారిత్రక ప్రదేశాలకు వస్తున్న వారి కోసం మౌలిక వసతులు కల్పించింది. ఖిలావరంగల్, వేయి స్తంభాల గుడి, భద్రకాళి గుడి, జైన మందిరం ప్రాంతాలను సరికొత్తగా తీర్చిదిద్దారు. వినూత్నంగా సరిగమప పార్కును అభివృద్ధి చేశారు. కుడా నిధులతో నగరంలోని విశాలమైన రోడ్లను, స్మార్ట్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నది. కుడాలోని నిధులతో వరంగల్ మహానగరంలోని ఇన్నర్ రింగు రోడ్డు భూసేకరణ ప్రక్రియను చేపట్టారు. వెంచర్ల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకున్న కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నగరాభివృద్ధిలో భాగస్వామి అవుతోంది.