మహబూబాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ)/మహబూబాబాద్: మానుకోట అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారని అదేరోజు రూ.62.50 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్, రూ.560 కోట్లతో నిర్మించిన మెడికల్, నర్సింగ్ కళాశాల భవనాలతో పాటు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం లక్ష మందితో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. ఈమేరకు పర్యటన ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ అధ్యక్షురాలు అంగోత్ బిందు, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అధికార యంత్రాంగంతో కలిసి మంత్రులు పరిశీలించారు. సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురైన మానుకోటను టీఆర్ఎస్ సర్కారు అన్నింటా అభివృద్ధి చేసిందని ముఖ్యమంత్రికి జిల్లా ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని మంత్రులు పేర్కొన్నారు.
జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాకేంద్రంలో నిర్మించిన మెడికల్ కళాశాల, కలెక్టరేట్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆదివారం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ కే శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బయ్యారం రోడ్డులోని రవాణా శాఖ కార్యాలయం, సాలార్‌తండా వద్ద రెండు ప్రాంతాలను సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. గిరిజనులు అధికంగా ఉన్న మానుకోట ప్రాంతాన్ని గత ప్రభుత్వాలు విస్మరిస్తే, తెలంగాణ ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. మహబూబాబాద్‌లో మెడికల్, నర్సింగ్ కళాశాలు, జిల్లా దవాఖాన కోసం కేటాయించడం గొప్ప విషయమని అభివర్ణించారు. సుపరిపాలన కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఈ ఏడాది రూ.200కోట్లతో ప్రగతి పనులు జరిగాయని ప్రజలు గమనించాలని గుర్తు చేశారు.
జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల, కలెక్టరేట్ సమూదాయం, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని వివరించారు. అనంతరం జిల్లా కేంద్రంలో లక్ష మందితో భారీ బహిరంగసభ ఉంటుందన్నారు. ఈ సభావేదికపై నుంచి పోడు రైతులకు పట్టాలు సైతం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గతంలో మానుకోట ప్రజలు వైద్యకోసం వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రదేశాలకు వెళ్లేవారని, ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని, మహబూబాబాద్ మెడికల్ హబ్‌గా మారనున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ పాలనలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు పెట్టుకొని మళ్లీ టీఆర్ఎస్కు పట్టం కట్టాలని మంత్రులు పిలుపునిచ్చారు.
మెడికల్ కళాశాల ఒక వరం..
మానుకోటలో రూ.560కోట్లతో మెడికల్ కళాశాల, రూ.62.50 కోట్లతో కలెక్టరేట్ నిర్మించడం గొప్ప విషయమని మంత్రి సత్యవతి అన్నారు. ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఒక వరమని, దాన్ని నిర్మించి ఇక్కడి ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు చేసిన కృషి మరువలేనిదన్నారు. ముఖ్యమంత్రికి జిల్లా ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. ఉమ్మడి వరంగల్‌లో రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మానుకోటను జిల్లాగా ఏర్పాటు చేయడంతో అనేక అభివృద్ధికి నోచుకున్నదని, ఎంతోకాలంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న రైతులకు ముఖ్యమంత్రి స్వయంగా హక్కు పత్రాలు అందిస్తారని తెలిపారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాషా అభినవ్, ఆర్డీవో కొమురయ్య, డీఎస్పీ పంతాటి సదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ వెంకట్రాములు, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యులు సీతామహాలక్ష్మి, పర్కాల శ్రీనివాసరెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎండీ ఫరీద్, జడ్పీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, మంగళంపల్లి శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, మానుకోట ఏఎంసీ సుధగాని మురళి, కాంట్రాక్టర్లు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరంగారెడ్డి, రాష్ట్ర నాయకులు ఊకంటి యాకూబ్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, ముత్యం వెంకన్న, మహబూబ్‌పాషా, ప్రభాకర్, రావీశ్, నీలేశ్రాయ్ తదితరులు పాల్గొన్నారు.