దుగ్గొండి, నవంబర్ 13: ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు అన్నారు. మండలంలోని చలపర్తి గ్రామంలో ఎస్సై వంగల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట డివిజన్లోని పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని చలపర్తి గ్రామంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు, బెల్టు షాపుల్లో లభించిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సర్పంచ్ ముదురుకోళ్ల శారదాకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామాల్లో దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలు సృస్టించి, అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనదారులు మద్యం తాగి, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. అనుమానితులు గ్రామాల్లో సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ అడిగితే చెప్పొద్దన్నారు.కార్యక్రమంలో ఎంపీటీసీ రంపీస సోనీ రతన్, దుగ్గొండి రూరల్, నర్సంపేట టౌన్ సీఐలు సూర్యప్రసాద్, పులి రమేశ్, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ, నర్సంపేట ఎస్సైలు నవీన్‌కుమార్, రాజారాం, మహేందర్, తిరుపతి, సీమా పర్హీన్, లక్ష్మి,సిబ్బంది పాల్గొన్నారు.