వరంగల్, నవంబర్ 5 (నమస్తేతెలంగాణ) : మార్కెట్లో పంట ఉత్పత్తులకు మద్దతుకు మించి ధరలు పలుకుతున్నాయి. రైతులు పత్తి, మక్కజొన్న, పల్లికాయ దిగుబడులను ఎప్పటికప్పుడు వ్యవసాయ మార్కెట్కు తరలిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొనుగోళ్ల ప్రారంభం నుంచే రైతులు గరిష్ఠ ధరలు పొందుతున్నారు. ఇప్పటికే ఎనుమాముల మార్కెట్లో 59,669 క్వింటాళ్ల పత్తి, 11,043 క్వింటాళ్ల పల్లికాయ, 10,908 క్వింటాళ్ల మక్కజొన్న విక్రయించారు. శుక్రవారం క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.8,200, కనిష్ఠ ధర రూ.5,500 పలుకగా, మక్కజొన్నకు గరిష్ఠ ధర రూ.2,121 లభించింది. క్వింటాల్ పల్లికాయ గరిష్ఠ ధర రూ.6,700 పలికినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల కంటే ఎక్కువ రేటు పలుకుతుండడంతో రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేయడం లేదు. నేరుగా మార్కెట్కు తరలించి లాభాలు గడిస్తున్నారు.
వానకాలం పంట దిగుబడులు చేతికొస్తుండడంతో రైతులు మార్కెట్ దా రి పడుతున్నారు. పంట ఉత్పత్తులను ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ రేటు లభిస్తుండడంతో కొన్ని పంట ఉత్పత్తులను నిల్వ చే యడం లేదు. మార్కెట్లో అమ్మి తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలిస్తే క్వింటాల్ సాధారణ రకం ధాన్యం రూ.2,040, ఏ గ్రేడ్ రకం ధాన్యం రూ.2,060, జొన్నలు(హైబ్రిడ్) రూ.2,970, జొన్నలు (మల్దండి) రూ.2,990, సజ్జలు రూ.2,350, రాగులు రూ.3,578, మక్కజొన్నలు రూ.1,962, కందులు రూ.6,600, పెసలు రూ.7,755, మినుములు రూ.6,600, వేరుశనగ రూ.5,850, పొద్దుతిరుగుడు రూ.6,400, సోయాబీన్ రూ.4,300, నువ్వులు రూ.7,830, నల్ల నువ్వులు రూ.4,858, పత్తి (మీడియం స్టేపుల్) రూ.6,080, పత్తి (లాంగ్ స్టేపుల్) రూ.6,380. వీటిలో ప్రధానంగా వరి, పత్తి, మక్కజొన్న, వేరుశనగ, మినుములు, పెసలు, కందులు, జొన్నలు, పొద్దుతిరుగుడు, సోయాబీన్, నువ్వులు జిల్లాలో సాగవుతున్నాయి.
ఇక్కడ ప్రధానమైనవి మాత్రం వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు. పత్తి, మక్కజొన్న, వేరుశనగ పంటల దిగుబడులు కొద్ది రోజుల నుంచి వస్తున్నాయి. వరి కూడా కోయడం మొదలైంది. ఈ నేపథ్యంలో మద్దతు ధరతో రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. త్వరలో గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏటా వానకాలం, యాసంగి ధాన్యాన్ని రైతులు ఈ కేంద్రాల్లోనే విక్రయిస్తున్నారు. గతంలో మార్కెట్లో పత్తికి మద్దతు ధర పలుకని సమయంలో ప్రభుత్వం జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేది. గత ఏడాది నుంచి ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే మార్కెట్లో పత్తికి ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ ధర రైతులకు లభిస్తున్నది. మక్కజొన్నలదీ ఇదే పరిస్థితి. దీంతో రైతులు పత్తి, మక్కజొన్న, వేరుశనగ పంట ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముతున్నారు. వీటికి మద్దతు కంటే ఎక్కువ రేటు వస్తుండడంతో రైతులకు ఊరట కలుగుతున్నది.
ధరలను పరిశీలిస్తే…
ఈ ఏడాది పత్తి, మక్కజొన్న, వేరుశనగ వంటి పంట ఉత్పత్తులకు మార్కెట్లో ఆశించిన రేటు దక్కుతుండడంతో రైతులు ఉపశమనం పొందుతున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ పంట ఉత్పత్తులకు పలికిన ధరలను పరిశీలిస్తే క్వింటాల్ పత్తి గరిష్ఠ ధర రూ.8,200, మాడల్ ధర రూ.6,800, కనిష్ఠ ధర రూ.5,500. నిబంధనల ప్రకారం గల పత్తికి ఇక్కడ రైతులు ఎక్కువగా క్వింటాల్ పత్తికి రూ,6,800 నుంచి రూ.8,200 పొందారు. నాణ్యత కొరవడిన పత్తికి రూ.5,500 పలికినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు. క్వింటాల్ మక్కజొన్న గరిష్ఠ ధర రూ.2,121, మాడల్ ధర రూ.2,100, కనిష్ఠ ధర రూ.1,529 పలికింది.
అత్యధిక శాతం మక్కజొన్నలకు రైతులు ఈ గరిష్ఠ, మాడల్ ధర పొందారు. క్వింటాల్ వేరుశనగ గరిష్ఠ ధర రూ.6,700 పలికినట్లు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని రైతులు వానకాలం ఎక్కువగా సాగు చేసిన పత్తి, మక్కజొన్న, వేరుశనగ పంటల ఉత్పత్తులకు ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు కంటే ఎక్కువ ధర లభిస్తుండడం విశేషం. ముఖ్యంగా ఈ ఏడాది మార్కెట్లో పత్తికి అధిక ధర లభించనుందనే భరోసా ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలను విశ్లేషిస్తున్న నిపుణులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. మక్కజొన్న, వేరుశనగ పంట ఉత్పత్తుల మార్కెట్ ధరలపైనా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రధాన పంటల్లో మరొకటైన మిర్చి దిగుబడులు రావడం ఇంకా మొదలుకాలేదు.
ఉత్పత్తుల రాబడులు ఇలా..
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈ ఏడాది ఇప్పటివరకు 59,669 క్వింటాళ్ల పత్తి వచ్చింది. ఇందులో రైతులు 7,306 బస్తాల ద్వారా 5,778 క్వింటాళ్ల పత్తిని శుక్రవారం వరకు తెచ్చారు. మక్కజొన్నలు 10,908 క్వింటాళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు 11,043 క్వింటాళ్ల పల్లికాయ అమ్మినట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు పత్తి, మక్కజొన్న, పల్లికాయకు ఎనుమాముల మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ రేటు పలుకలేదని తెలిపారు.