కురవి ఏకలవ్య పాఠశాల వేదికగా మంగళవారం రాష్ట్రస్థాయి క్రీడా పండుగ ఉత్సాహంగా ఆరంభమైంది. ఈఎంఆర్ఎస్(ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) సొసైటీ ఆధ్వర్యంలో తొలిసారి జరుగుతున్న గేమ్స్-స్పోర్ట్స్ మీట్‌కు మానుకోట జిల్లా ఆతిథ్యమిస్తున్నది. నాలుగు రోజుల పాటు సాగే పోటీలకు తెలంగాణలోని 23 పాఠశాలల నుంచి 1300, స్థానిక క్రీడాకారులతో కలిపి మొత్తం 2వేల మందితో మైదానమంతా సందడిగా మారింది. అండర్-14, అండర్-19 విభాగాల్లో మొత్తం 17 రకాల పోటీలు నిర్వహించనుండగా ఐటీడీఏ పీవో అంకిత్‌తో కలిసి కలెక్టర్ శశాంక క్రీడలను ప్రారంభించారు. పాఠశాల పేరునే స్ఫూర్తిగా తీసుకొని ఏకలవ్యుడి వారసులుగా తమ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. తొలిరోజు కబడ్డీ, తైక్వాండో, బాక్సింగ్, వాలీబాల్ పోటీల్లో క్రీడాకారులు సత్తాచాటగా, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కురవి, నవంబర్ 1 : కురవిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో ఈఎంఆర్ఎస్ సొసైటీ ఆధ్వర్యంలో తొలిసారి ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు మంగళవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ క్రీడల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 పాఠశాలల క్రీడాకారులు 1300, వ్యాయామ ఉపాధ్యాయులు 50, మరో 350మంది ఉపాధ్యాయులు, అధికారులు, వర్కర్లు పాల్గొంటున్నారు. కురవి గురుకుల విద్యార్థులతో కలిపి సుమారు 2000కు పైగా విద్యార్థిని, విద్యార్థులు, క్రీడాకారులు, ఉపాధ్యాయులు, అధికారులతో ఈఎంఆర్ఎస్ మైదానాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్య అతిథిగా మహబూబాబాద్ కలెక్టర్ శశాంక హాజరై ఐటీడీఏ పీవో అంకిత్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జాతీయ జెండా, క్రీడా పతాకాలను ఎగురవేసి జాతీయ నాయకుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని కబడ్డీ, తైక్వాండో, బాక్సింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక వాలీబాల్ సర్వీస్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.
క్రీడాకారులకు సకల సౌకర్యాలు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడకారులకు సకల సౌకర్యాలు కల్పించారు. మొత్తం 2080 మందికి బస ఏర్పాట్లు చేశారు. కురవి పీహెచ్సీ ఆధ్వర్యంలో గోపి నేతృత్వంలో క్రీడాకారులకు అందుబాటులో వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. 108 వాహనాన్ని అందుబాటులో ఉంచారు. 52 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పోటీలను పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అండర్-19 విభాగంలో గ్రూపు పోటీలు ఉండగా, అండర్-14 విభాగంలో వ్యక్తిగత, గ్రూపు పోటీలు నిర్వహిస్తున్నారు.
తొలిరోజు విజేతలు..
అండర్-19(బాలురు) 800 మీటర్లు : జి.నరేశ్ -బాల్నగర్(మహబూబ్‌నగర్), జె.అర్జున్-గాంధారి, సి.ప్రకాశ్-బాల్నగర్(మహబూబ్‌నగర్)
అండర్-17(బాలురు) 800 మీటర్లు : ఎం.సురేశ్-బాల్నగర్(మహబూబ్‌నగర్), బి.అఖిల్-గాంధారి(నిజామాబాద్), డి.శ్రీరాం-గాంధారి(నిజామాబాద్)
అండర్-17(బాలికలు) 800 మీటర్లు : బి.నేహా-ముల్కలపల్లి(భద్రాద్రి కొత్తగూడెం), బి.సౌమ్య-సీరోలు(మహబూబాబాద్), బి.శైలజ-ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల)
అండర్-14 బాలురు(400 మీటర్లు) : ఎన్.శ్రీనివాస్-గాంధారీ(నిజామాబాద్), బి.అరుణ్-బాల్నగర్(మహబూబ్‌నగర్), ఎస్.రాహుల్-గాంధారి(నిజామాబాద్)
అండర్-14 బాలికలు(400 మీటర్లు) : బి.అలివేణి-బయ్యారం(మహబూబాబాద్), దుర్గ-గండుగులపల్లి(భద్రాద్రి కొత్తగూడెం), బి.లిఖిత-కురవి(మహబూబాబాద్)
హ్యాండ్‌బాల్‌లో అండర్-19 బాలికల విభాగంలో తొలి రౌండ్ సీరోలు- గుండాల జట్లు తలపడగా గుండాల వాకౌట్ కాగా, సీరోలు గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో కురవి-నార్నూర్ జట్లు తలపడగా కురవి(05), నార్నూర్(01) రాగా కురవి గెలుపొందింది.
కబడ్డీ అండర్-19 బాలికల విభాగంలో కురవి(23)-కొత్తగూడ(16) జట్లు తలపడగా కురవి గెలుపొందింది. సీరోలు(29)-పాల్వంచ(16) జట్లలో సీరోలు విజయం సాధించింది. గూడూరు-బాల్నగర్, పాల్వంచ-గండుగులపల్లి జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
ఖో-ఖో అండర్-19 బాలుర విభాగంలో టేకులపల్లి(07)-గాంధారి(06) జట్లు తలపడగా టేకులపల్లి గెలుపొందింది. సింగరేణి(02)-కల్వకుర్తి(06)లో కల్వకుర్తి, నార్నూర్(01)-సిర్పూర్(00)లో నార్నూర్, మర్రిమట్ల(14)-గూడూరు(00) జట్లు తలపడగా మర్రిమట్ల గెలుపు వన్‌సైడ్ అయింది. ఇందులో పాండురంగ అత్యుత్తమ ప్రతిభ చూపారు.
‘ఏకలవ్య’ విద్యార్థులు ప్రతిభావంతులు
– పీఓ అంకిత్
ఏకవల్య గురుకుల విద్యార్థుల్లో అత్యంత ప్రతిభ దాగున్నదని.. ప్రతిభచూపి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్ పిలుపునిచ్చారు. మేరికోమ్ వంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని ఒలింపిక్ స్థాయిలో లక్ష్యాలు పెట్టుకోవాలన్నారు. క్రీడలను ప్రో త్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మ హబూబాబాద్ జిల్లాల ఆర్సీవో రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గురుకుల డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్, ఓఎస్డీ స్వర్ణలత, ప్రిన్సిపాల్ సరిత, ఆర్డీవో కొమురయ్య, డీఎంహెచ్‌వో, ఎంపీపీ గుగులోత్ పద్మావతి, సర్పంచ్ నూతక్కి పద్మ, ఎంపీటీసీ చిన్నం భాస్కర్, ఎంపీడీవో సరస్వతి, తహసీల్దార్ ఇమ్మాన్యూయేల్, ఆలయ మాజీ చైర్మన్ రాజునాయక్, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ గుగులోత్ రవి, వైస్ ప్రిన్సిపాల్ భరణి, ఆర్సీవోలు నాగార్జున, డీఎస్ వెంకన్న, సంపత్, స్పోర్ట్స్ ఆర్గనైజర్ వీర్యానాయక్, స్టేట్ స్పోర్ట్స్ అధికారి రమేశ్, శ్రీహరి, కిషన్, గణేశ్, జ్యోతి, విజయ, శ్రీనివాసరావు, సంపత్, రవికుమార్, టీవీ.రాజు, భిక్షపతి, డీఎస్ సూక్యనాయక్, మాంకాళి వెంకటేశ్వర్లు, చాంప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఏకలవ్యుడి స్ఫూర్తితో ఆడాలి..
– కలెక్టర్ శశాంక
ఏకలవ్య గురుకులంలో చదువుకునే విద్యార్థులు మీ పాఠశాల పేరునే స్ఫూర్తిగా తీసుకోవాలని.. మహాభారతం వంటి మహాకావ్యంలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న ఏకలవ్యుడి వారసులుగా అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన 1300 మంది క్రీడాకారులంతా ఇప్పటికే విజయం సాధించారన్నారు. రాష్ట్రంలోని 23 ఈఎంఆర్ఎస్ స్కూళ్లలో 7వేలకు పైగా విద్యార్థులున్నారని.. మీలో ప్రత్యేక ప్రతిభ ఉన్నందునే ఈ స్థాయికి వచ్చారంటూ వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. క్రీడల్లో రాణిస్తే ఉన్నత లక్ష్యాల చేరువకు పునాదులుగా మారుతాయన్నారు. ఆత్మైస్థెర్యం.. దృఢనిశ్చయం.. క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా గెలుపు సాధించవచ్చన్నారు. అన్ని స్కూళ్ల కంటే ఈఎంఆర్‌ఎస్‌లో క్రీడలకు ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రిన్సిపాళ్లు, పీడీలు ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించాలని కోరారు. గతంలో మాదిరిగా కాకుండా చదువుకోలేని సమయంలో ఆటలు కాకుండా నిత్య గేమ్స్ ప్రాక్టీస్ ఉండాలన్నారు. విద్యార్థుల్లో వ్యక్తిత్వం వికసించాలన్నా.. గెలుపోటములను స్వీకరించాలన్నా ఆ బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. చదువుతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా స్టేట్ మీట్లో ఏ స్కూల్ చాంపియన్‌గా నిలుస్తుందని క్రీడాకారులను కలెక్టర్ ప్రశ్నించగా కొన్ని జిల్లాల వారు మేమంటే మేమని ఉత్సాహంగా ఫ్లకార్డులు చూపారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులంతా గెలుపోటములను స్వీకరించి క్రీడాస్ఫూర్తితో మెదలాలని సూచించారు. క్రీడల కోసం జిల్లాస్థాయి అధికారులు 15రోజులుగా కష్టపడి పనిచేశారని, ఇదే స్ఫూర్తితో విజయవంతం అయ్యేలా సమన్వయంతో పనిచేయాలన్నారు.