గత ఏడాది తీవ్ర నష్టాల నేపథ్యంలో ఈసారి మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. జిల్లాలోని 13 మండలాల్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 15వేల ఎకరాలు కాగా, రైతులు ఇప్పటివరకు 12,157 ఎకరాల్లో మాత్రమే వేసినట్లు నమోదైంది. ఇంకా సాగు చేసే అవకాశం ఉన్నా 14వేల ఎకరాలకు మించదని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది తొలిసారిగా నల్ల తామరపురుగు ఆశించగా ఉద్యాన శాఖ, శాస్త్రవేత్తల సూచనలతో నివారణ మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయి పెట్టుబడి కూడా రాలేదు. మళ్లీ నల్లతామర పురుగు వస్తుందని మిర్చి సాగుపై అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో తొలిసారిగా సాధారణ సాగు విస్తీర్ణం కంటే తక్కువగా నమోదైంది.
వరంగల్, నవంబర్ 1(నమస్తేతెలంగాణ): జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కూడా నమోదు కాలేదు. జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటల్లో ఎర్ర బంగారం ఒకటి. ఏటా వరి, పత్తి, మక్కజొన్న తర్వాత మిర్చి పంటే సాగైంది. మార్కెట్లో ఇటీవల క్వింటాల్ ధర అత్యధికంగా రూ.90వేలు పలికిన దేశవాలీ రకాన్ని ఇక్కడి రైతులే సాగు చేశారు. దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, చెన్నారావుపేట తదితర మండలాల్లో చపాట రకం సాగు చేసి ప్రత్యేకత చాటారు. జిల్లాలో మిర్చి పంట సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 15వేల ఎకరాలు.
గత ఏడాది వరకు రైతులు ఏటా సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా ఇదే పంట వేశారు. ఉద్యానశాఖ నివేదిక ప్రకారం గత ఏడాది పంట సాగు విస్తీర్ణం దాదాపు ఎకరాలు దాటింది. కానీ అనూహ్యంగా నష్టాలు ఎదురుకావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మునుపెన్నడూ లేనివిధంగా గత ఏడాది మిర్చి పంటకు తొలిసారిగా నల్ల తామరపురుగు ఆశించింది. నివారణ కోసం రైతులు ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన మందులను వాడినా ఫలితం లేకపోయింది. చివరికి పెట్టుబడిని సైతం కోల్పోయి తీవ్ర నష్టాలను చవిచూశారు. దీంతో ఈసారి మిర్చి సాగుకు వెనుకడుగు వేస్తున్నారు. దానికి బదులు ఇతర పంటలను సాగు చేస్తున్నారు.
భారీగా తగ్గుదల
అధికారులు ఊహించినట్లుగానే ఈసారి జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం తగ్గింది. 13 మండలాల్లో ఇప్పటివరకు రైతులు వానాకాలం 7,143, యాసంగి 5,014 ఎకరాలు కలిపి మొత్తం 12,157 ఎకరాల్లో వేసినట్లు అధికారులు పంటల నమోదు కార్యక్రమంలో నమోదు చేశారు. అందులో దుగ్గొండి ప్రథమ, నల్లబెల్లి ద్వితీయ, నర్సంపేట మండలం తృతీయ స్థానాల్లో ఉన్నాయి. దుగ్గొండిలో 3,260, నల్లబెల్లిలో 3,003, నర్సంపేటలో 2,576 ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు. చెన్నారావుపేటలో 1,355, నెక్కొండలో 965, ఖానాపురంలో 604, రాయపర్తిలో 170, గీసుగొండలో 128, సంగెంలో 37, పర్వతగిరిలో 31, వర్ధన్నపేటలో 14, ఖిలావరంగల్లో 9, వరంగల్లో 3 ఎకరాల్లో సాగైనట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. ప్రస్తుత యాసంగి రైతులు ఇంకా కొన్ని ఎకరాల్లో మిర్చి పంట సాగు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఏడాది 14వేల ఎకరాలు దాటేలా కనపడటం లేదని అధికారులు అంచనా వేశారు.
అంటే జిల్లాలో తొలిసారి మిర్చి పంట సాధారణ విస్తీర్ణం కూడా నమోదు కావడం లేదు. మిర్చి సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం 25శాతం తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం గత ఏడాది నల్ల తామర పురుగు ఆశించి నష్టం కలిగించడమేనని ఉద్యానశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ పురుగు ఈ ఏడాది కూడా ఆశించి నష్టపరుస్తుందనే ఆలోచనతో రైతులు మిర్చి పంటసాగు విస్తీర్ణం తగ్గించినట్లు చెబుతున్నారు. రైతులు గత ఏడాది మిర్చి పంట సాగు చేసిన విస్తీర్ణంలో ఈ ఏడాది సుమారు 40శాతం తగ్గించి ఇతర పంటలను సాగు చేసినట్లు అధికారులు గుర్తించారు. విస్తారంగా వర్షాలు కురవడం మరో కారణమని తెలిపారు.