వరంగల్, అక్టోబర్ 30 (నమస్తేతెలంగాణ) : చారిత్రక సన్నూరు ఆలయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. దేవాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వహణ లోపంతో 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలోని పలు కట్టడాలు జీర్ణావస్థకు చేరాయి. ఈ క్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఆలయ ప్రాశస్త్యాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసింది. ఇటీవల మంత్రి కలెక్టర్ గోపి, దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు. సాధ్యమైనంత త్వరలో పనులను మొదలుపెట్టాలని ఆదేశించగా, త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారుల సమాయత్తం అవుతున్నారు.
ఇన్నాళ్లు నిరాదరణకు గురైన చారిత్రక సన్నూరు వేంకటేశ్వరస్వామి దేవాలయం ఇప్పుడు పూర్వ వైభవం సంతరించుకోనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇటీవల రూ.10 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో నిర్దేశిత పనులు చేపట్టేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయానికి తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేవాలయం నిర్వహణ కోసం దాతలు స్వామి పేర కొన్ని వందల ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారు. ఇప్పటికీ రికార్డుల్లో స్వామి పేర సుమారు 900 ఎకరాల భూమి ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. కౌలుదారులు 1984 వరకు ఈ భూమికి కౌలు చెల్లించేవారు. తర్వాత కరువుతో కౌలు చెల్లించడం మానేశారు. అప్పట్లో 30 మంది అర్చకులు ఉండేవారు. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో ఇక్కడ జాతర జరిగేది.
సన్నూరు చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున చెలక బండ్ల ద్వారా జాతరకు తరలివచ్చి దేవాలయం వద్ద ఊరేగింపు నిర్వహించేవారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకునే వారు. జాతర సమయంలో పరిసర గ్రామాల్లోని పాఠశాలలకు సెలవులు కూడా ఇచ్చేవారని చెప్పారు. ఈ దేవాలయంలో ఒకరోజు రాత్రి నిద్ర చేస్తే బాధలు, సమస్యలు తొలిగిపోతాయనేది స్థానికుల నమ్మకం. ముఖ్యంగా ఇక్కడ కల్యాణం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. పలు ప్రత్యేకతలతో ఒక వెలుగు వెలిగిన ఈ దేవాలయం కాలక్రమేణా నిర్లక్ష్యానికి గురైంది. చివరకు నిర్వహణ భారంగా తయారైంది. ఈ నేపథ్యంలో దాతలు కొందరు ముందుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఏర్పడి ఆలయ అభివృద్ధికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కుందూరు రామకృష్ణారెడ్డి(రంగాపురం), డాక్టర్ కుందూరు రాజేందర్‌రెడ్డి(సోమారం), కే భిక్షమరెడ్డి(సన్నూరు), కొండం వెంకట్‌రెడ్డి(పోతిరెడ్డిపల్లి), కే రవీందర్‌రెడ్డి(సోమారం), కే రమేశ్‌రెడ్డి(కాట్రపల్లి), కే శ్రీనివాస్‌రెడ్డి(సన్నూరు), కే రాజేశ్‌రెడ్డి(రంగాపురం), కుందూరు సాయిరాంరెడ్డి(పోచంపల్లి) కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆలయ అభివృద్ధికి వీరు తమ సొంత నిధులు వెచ్చించి కొన్ని పనులు చేశారు. తమకు సహకరిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి ఈ దేవాలయానికి పూర్వ వైభవం తేవడానికి ప్రతిపాదనలు చేశారు.
సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన మంత్రి..
సన్నూరు వేంకటేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి రూపొందించిన ప్రతిపాదనలను మంత్రి ఎర్రబెల్లి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దేవాలయ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ క్రమం లో ఆలయ అభివృద్ధికి కమిటీ వేశారు. కమిటీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కోడూరు నర్సింహారెడ్డి(మాడూరు), కుందూరు తిరుమల్‌రెడ్డి(సోమా రం), కుందూరు కరుణాకర్‌రెడ్డి (కాట్రపల్లి), కే గోపాల్‌రెడ్డి(మొరిపిరాల) సభ్యులుగా ఉన్నారు. రూ.10 కోట్లు మంజూరైన వెంటనే మంత్రి కలెక్టర్ గోపి, దేవాదాయ శాఖ అధికారులతో పాటు ఆలయ ఎగ్జిక్యూటివ్, డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ దేవాదాయ శాఖ, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు, కమిటీల్లోని సభ్యులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. రూ.10 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనుల డిజైన్ పరిశీలించారు. డిజైన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే అనుమతులు పొంది మరి కొద్దిరోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
చేపట్టనున్న పనులు ఇవే..
ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రూ.10 కోట్లతో సన్నూరు దేవాలయంలో ప్రధానంగా నాలుగు అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంది. ఆలయం ఆవరణలో కొత్తగా కోనేరు, గుడి లోపల మహా మండపం, దేవాలయం చుట్టూ ప్రహరీతో పాటు సమీపంలో ఉన్న శివాలయ పునర్నిర్మాణం, సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు కోనేరు, మహా మం డపం, ప్రహరీ, శివాలయం పునర్నిర్మాణం, సుందరీకరణ పనులతో డిజైన్ తయారవుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ దేవాలయం ఆధీనంలో 84 ఎకరాలు ఉండటంతో రూ.10 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు కూడా చేసేందుకు ఎగ్జిక్యూటివ్, అభివృద్ధి కమిటీలు మంత్రి సహకారంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.