హసన్పర్తి, అక్టోబర్ 28: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేటలో దీపావళి పండుగను పురస్కరించుకొని నేతకాని కులస్తులు మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక బతుకమ్మ ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు బతుకమ్మలను పేర్చి ఊరేగింపుగా బయల్దేరారు. అనంతరం బతుకమ్మలు ఒక దగ్గర పెట్టి ఆడిపాడారు. ఆ తర్వాత చెరువులో నిమజ్జనం చేశారు. చుట్టుపక్కల గ్రామాల వారితో పాటు, వివిధ రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి వేడుకలను తిలకించారు. ఉత్సవాలు సజావుగా సాగడానికి బతుకమ్మ విగ్రహం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేసిన సర్పంచ్ జనగాం శరత్, ఎంపీటీసీ రజిత, పంచాయతీ సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.