వరంగల్, అక్టోబర్ 28 : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె గ్రేటర్‌లోని 30, 51వ డివిజన్లలో పురోగతిలో ఉన్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 51వ డివిజన్ పరిధిలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ ప్రాంతంలో అంతర్గత బీటీ రోడ్డు, ప్రహరీ, డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం హంటర్‌రోడ్డు, వడ్డేపల్లి, అశోకాకాలనీ, జవహర్‌కాలనీ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతుల కోసం స్థలాలను పరిశీలించారు. బాలసముద్రం, న్యూశాయంపేట ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ అభివృద్ధి పనులను ఇంజినీర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల్లో నాణ్యత పాటించకుంటే బిల్లులో కోత విధిస్తామని ఆమె హెచ్చరించారు. పారిశుధ్య వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. ఆమె వెంట బల్దియా ఈఈ శ్రీనివాసరావు, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, డీఈ సంతోష్‌బాబు, ఏఈ అరవింద, సైట్ ఇంజినీర్ కిరణ్‌కుమార్, మాధవరావు తదితరులు ఉన్నారు.