నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీఆర్ఎస్ సర్కారును ఇబ్బందులు పెట్టే కుట్రలకు తెరలేపిన బీజేపీపై గులాబీ శ్రేణులు కన్నెర్రజేశాయి. కమలం పార్టీ విష పన్నాగాన్ని ఎండగడుతూ జిల్లా అంతటా గురువారం ఆందోళనలతో హోరెత్తించాయి. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఊరూరా ధర్నాలు, రాస్తారోకోలు చేసి ‘కపట కమలమా ఖబడ్దార్’ అని హెచ్చరించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్షా, కేంద్ర సర్కారు దిష్టిబొమ్మలను దహనం చేసి కాషాయ పార్టీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. టీఆర్ఎస్ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేకనే బీజేపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్ని కుయుక్తులు చేసినా తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని కుండబద్దలు కొట్టారు.
ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసిందని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును కాలరాస్తూ కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన బీజేపీ వ్యవహారంపై టీఆర్ఎస్తో పాటు అన్నివర్గాలవారు తీవ్రంగా స్పందించారు. వ్యాపారులు, స్వాములను మధ్యవర్తులుగా పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణను అస్థిర పరిచే కుట్రలకు తెరతీసిన బీజేపీ తీరును ఎండగట్టారు. ప్రజల తీర్పుతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరిచే కుట్రలను అమలు చేసేలా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో గురువారం దహనం చేశారు.
బుధవారం రాత్రి నుంచే బీజేపీ తీరును ఎండగడుతూ టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్-హైదరాబాద్, కరీంనగర్-వరంగల్-ఖమ్మం, వరంగల్-పరకాల-భూపాలపల్లి, వరంగల్-నర్సంపేట, వరంగల్-హుస్నాబాద్ దారుల్లో చాలా చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. కేంద్ర సర్కారు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. అంగట్లో సరుకులా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ బేరసారాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో జరిగిన ఓటుకు నోటు వ్యవహారంలానే ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని ప్రజలు, ప్రజాసంఘాల నేతలు విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీ కుట్రలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా తిప్పికొట్టారని అభినందించారు. తెలంగాణలో ప్రజల తీర్పును కాలరాసే కుట్రలకు స్థానం లేదనే విషయం తాజా ఘటనతో మరోసారి స్పష్టమైందని చెబుతున్నారు.