పోచమ్మమైదాన్, అక్టోబర్ 20 : సామాజిక చైతన్యం కోసం కళాకారులు తమ సేవలను అందిస్తున్నారని కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో వల్లంపట్ల ఆర్ట్స్ రాష్ట్రస్థాయి కళా పురస్కారాలను గురువారం అందజేశారు. ప్రముఖ కవి, రచయిత, జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు 67వ పుట్టినరోజు సందర్భంగా వల్లంపట్ల ఆర్ట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేయూ వీసీ ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు. నేటి స్మారక అవార్డులను అందజేస్తూ ప్రొత్సహించడం ప్రశంసనీయమన్నారు. వల్లంపట్ల ఆర్ట్స్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీ కృష్ణమాచారి అధ్యక్షతన జరిగిన ఉత్సవంలో మిమిక్రీలో పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ స్మారక అవార్డును కొండపల్లి మనోజ్‌కుమార్‌కు, గానంలో వరంగల్ శంకర్ స్మారక అవార్డును దండెపల్లి శ్రీనివాస్‌కు, డీ సారంగపాణి స్మారక అవార్డును వాణి వొల్లాలకు, వాయిద్యంలో మహ్మద్ జాఫర్ స్మారక అవార్డును షేక్ వాజీద్ హుస్సేన్ జాఫర్‌కు, సీహెచ్ కళా ప్రవీణ్ స్మారక అవార్డును రవి కల్యాణ్‌కు అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, ప్రొఫెసర్ బన్న అయిలయ్య, జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, వనం లక్ష్మీకాంతారావు, డోలి రాజలింగం, నేరెళ్ల శోభావతి, డాక్టర్ కే అనితారెడ్డి, కార్యక్రమ కన్వీనర్ ప్రొఫెసర్ రతన్‌సింగ్ ఠాకూర్, పెండ్యాల బ్రహ్మయ్య, డాక్టర్ కోలా రవికుమార్, కొక్కుల సంపత్, పరికిపండ్ల వేణు, మేడి సురేశ్, మ్యాకల సూరయ్య, వల్స పైడి, ఆర్ సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా తెలంగాణ మాండలిక భాషలో నాలుగు దశాబ్దాల క్రితం వల్లంపట్ల రచించిన ‘ఎలచ్చన్లచ్చినయ్’ జీవ నాటికను ప్రదర్శించారు. జీవీ బాబు దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటిక అందరినీ ఆకట్టుకుంది. అవార్డు గ్రహీతలైన కళాకారులు సంగీత గాన లహరి, మనోజ్ మిమిక్రీ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్బంగా వల్లంపట్ల నాగేశ్వర్రావు-రాజపద్మ దంపతులను ఘనంగా సత్కరించారు.