ములుగు జిల్లాలో విరుద్ధంగా జీ ప్లస్ త్రీ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా చేపడుతున్నారు. జిల్లాలో అన్నీ గ్రామ పంచాయతీలే ఉండగా కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జీ ప్లస్ టూ మాత్రమే అనుమతులు ఇవ్వాలి. కానీ జీ ప్లస్ త్రీ, అంతకంటే ఎక్కువ అంతస్తులు నిర్మిస్తున్న భవనాలు జిల్లా కేంద్రంతోపాటు మల్లంపల్లి, పస్రా, జంగాలపల్లి గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామ కార్యదర్శులు అంతస్తుకు రూ.50వేల చొప్పున ముడుపులు తీసుకొని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలో పోలీస్‌స్టేషన్‌ను ఆనుకొని మూడు అంతస్తుల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నా చర్యలు తీసుకోవడంలేదు. ములుగు త్వరలో మున్సిపాలిటీగా మారనున్నందున ఇప్పుడే ముడుపులు ఇచ్చి అక్రమంగా అనుమతులు పొంది నిర్మించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ములుగు, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): జిల్లాలో జీ ప్లస్ త్రీ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఇంటి నిర్మాణాలకు జీ ప్లస్ టూ వరకు మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలే ఉన్నందున అంతటా జీ ప్లస్ టూ వరకే అనుమతులు మంజూరు చేయాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, గ్రామ కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనుమతులు లేకుండా అదనపు నిర్మిస్తే గతంలో ఇక్కడ అదనపు కలెక్టర్‌గా పనిచేసిన ఆదర్శ్‌సురభి భారీగా జరిమానాలు విధించడంతోపాటు కూల్చివేయాలని ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలు అమలు కాకపోగా, ఇప్పటివరకు ఒక్కో భవన యజమానికి రూ.50వేల వరకు జరిమానాలు విధించడంతోపాటు పంచాయతీ కార్యదర్శులు భారీగా ముడుపులు తీసుకుంటూ చూసీచూడనట్లు వదిలివేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంతోపాటు మల్లంపల్లి, పస్రా, జంగాలపల్లి గ్రామాల్లో పెద్ద సంఖ్యలో భవనాలు నిర్మితమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే సీతక్క ఇటీవల కొనుగోలు చేసిన భవనంపై నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా స్టేషన్‌ను ఆనుకొని ఓ యజమాని మూడు అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టడం విశేషం.
గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మరో రెండు అంతస్తులకు అనుమతులు మంజూరు చేసే అవకాశం పంచాయతీ కార్యదర్శులకు ఉంది. అదనపు అంతస్తులు నిర్మించాలనుకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీకి చెందిన డీటీసీపీ అధికారుల వద్ద అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనిపై ములుగు గ్రామపంచాయతీ అధికారులు అవగాహన కల్పించడంలేదు. పైగా ములుగు జీపీ కార్యాలయంలోనే అనుమతులు ఇస్తున్నారు. అదనపు అంతస్తులు, పెంట్‌హౌస్‌లు నిర్మించే క్రమంలో జీపీ అధికారులు పనులను అడ్డుకొని బెదిరింపులకు గురిచేస్తున్నారు. అనంతరం దళారులతో రాయబారాలు నడిపి జరిమానాలు విధించడంతోపాటు ముడుపులు పుచ్చుకొని పనులను కొనసాగించేందుకు సహకరిస్తున్నారు. జిల్లా కేంద్రం త్వరలో మున్సిపాలిటీగా మారనున్న నేపథ్యంలో ఖాళీ యజమానులందరూ భనవ నిర్మాణాల అనుమతులకు భవిష్యత్తులో మున్సిపాలిటీకి అధిక మొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడే అనుమతుల మంజూరుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న గ్రామ కార్యదర్శితోపాటు సిబ్బంది ఇష్టారాజ్యంగా అనుమతులు మంజూరు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా జీ ప్లస్ త్రీ భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదు. జరిమానాలు విధించి అదనపు అంతస్తులకు అనుమతులు ఇవ్వాలని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలను నిర్మిస్తున్న యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆదేశాలు జారీచేశాం. ముడుపులు తీసుకున్నట్లు తేలితే సంబంధిత జీపీ కార్యదర్శులు, సిబ్బందిపై వేటు తప్పదు. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
– కొండా వెంకయ్య,ములుగు జిల్లా పంచాయతీ అధికారి