హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 17 : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలను తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. పెద్దమ్మగడ్డ గిరిజన గురుకుల(బాలికల) జూనియర్ కళాశాలలో 6వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్-2022 కార్యక్రమాన్ని సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ దేశంలో ఎకడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను స్థాపించి అత్యంత నాణ్యతాప్రమాణాలతో విద్యను అందిస్తుందన్నారు.
గురుకులాల విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సాంకేతికను అందిపుచ్చుకుని ప్రపంచంతో పోటీ పడాలన్నారు. గురుకులాలను స్థాపించి కొన్ని లక్షల మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ఒకో విద్యార్థిపై 1.20 లక్షలరూపాయలను ప్రభుత్వం ఖర్చుచేస్తోందని చెప్పారు. ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల కోసం గురుకులాల విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దకుతుందన్నారు. విద్యార్థులు కూడా తమ ప్రతిభను కనబరిచి ఉత్తమ ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు.
అంతేకాకుండా జాతీయ క్రీడల్లో సైతం గురుకులాల్లో చదివే విద్యార్థులు తమ సత్తాను చాటుతూ పలు అవార్డులను సైతం పొందడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికే అనేక నిధులు వెచ్చించి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో గురుకులాల కార్యదర్శి రొనాల్డ్‌రాస్, కలెక్టర్ రాజీవ్ గాంధీహన్మంతు, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్‌కుమార్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.