సుబేదారి, అక్టోబర్ 17 : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఒకరితోపాటు మరో ఇద్దరు దారిదోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కమిషనర్ తరుణ్‌జోషి నిందితుల వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా అదిసర్లపల్లి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నార్ల నరేశ్ ఇంటర్ వరకు చదివి జల్సాలకు అలవాటుపడ్డాడు. ఆర్మీ యూనిఫాం, ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేసి నకిలీ ఐడీ కార్డుతో ఆర్మీలో పనిచేస్తున్నానని ప్రచారం చేసుకున్నాడు.
నరేశ్ తన గ్రామానికి చెందిన ఐదుగురికి నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.ఐదు లక్షల చొప్పున వసూలు చేశాడు. శిక్షణ పేరుతో వారిని మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వైష్ణవి కెరీర్ ఫౌండేషన్‌లో చేర్పించాడు. మోసపోయామని గ్రహించిన యువకులు నరేశ్‌ను నిలదీయడంతో తిరిగి డబ్బులు ఇచ్చాడు. ఇటీవల ఎన్ఐఏ అధికారులు పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్న వ్యక్తుల ఇండ్లలో సోదాలు చేశారు. విషయాన్ని ప్రసారమాధ్యమాల ద్వారా తెలుసుకున్న నరేశ్.. ఎన్ఐఏ అధికారినంటూ నేలపట్ల రాజేశ్, వినయ్‌బాబును పరిచయం చేసుకున్నాడు.
వారితో కలిసి కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను ఎన్ఐఏ అధికారినంటూ డబ్బుల కోసం బెదిరించాడు. బాధితులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారు. టెక్నాలజీ సాయంతో సోమవారం కేయూసీ మొదటి గేట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా నకిలీ ఎన్ఐఏ అధికారి నరేశ్ పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి పోలీసులు ఎయిర్ పిస్టల్, ఆర్మీ డ్రెస్, ల్యాప్‌టాప్, రెండు బైక్‌లు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
కేసులో ప్రతిభ చూపిన డీసీపీ అశోక్‌కుమార్, హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్, కేయూసీ సీఐ దయాకర్, సిబ్బందిని సీపీ అభినందించారు. అలాగే, కాజీపేట బాపూజీనగర్‌కు చెందిన గండికోట వెంకన్న, కంది అబ్బులు ఈనెల 13న ఔటర్‌రింగ్‌రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనదారుడిని బెదిరించి బంగారు చైన్, రూ.3,600 నగదుతోపాటు మరో మూడు వేల రూపాయలను ఫోన్‌పే ద్వారా బదిలీ చేసుకున్నారు. రెడ్డిపురం వద్ద వాహనాల తనిఖీలో ఇద్దరు దొంగలను పట్టుకున్నట్లు సీపీ వెల్లడించారు.