వరంగల్, అక్టోబర్ 16(నమస్తేతెలంగాణ) ;ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు రైతులు సాగు చేసిన వరి పంట వివరాలను వ్యవసాయశాఖ నుంచి సేకరించారు. ఈ సంవత్సరం వర్షాలు విస్తారంగా కురవడంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత ఏడాదికి అదనంగా 21వేల ఎకరాల్లో అన్నదాతలు సాగు చేశారు. జిల్లాలో సుమారు 1.39 లక్షల ఎకరాల్లో వరి వేయగా, 3.29 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వానికి పంపిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. రైతుల నుంచి 2.35 లక్షల టన్నులు కొనాల్సి ఉంటుందని, గ్రామాల్లో 157 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సెంటర్ల నుంచి ధాన్యం తరలింపునకు ట్రాన్స్‌పోర్టు టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
వర్షాలు విస్తారంగా కురవడడంతో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు ఎక్కువగా వరి సాగుకు మొగ్గు చూపారు. సుమారు 1.39 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది వానకాలం జిల్లాలో 1.18 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. ఈ ఏడాది అదనంగా మరో 21వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయడం విశేషం. జిల్లాలో ప్రధా న పంటలు వరి, పత్తి. ఈ రెండింటిలో ప్రస్తుత వానకాలం వరి పంట విస్తీర్ణం అనూహ్యంగా ఎగబాకింది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభు త్వం సమాయత్తమవుతోంది. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇటీవల అధికార యంత్రాంగాన్ని ఆదేశింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కసరత్తు చేపట్టారు. ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ అధికారులు రైతులు సాగు చేసిన వరి పంట వివరాలను వ్యవసాయశాఖ నుంచి సేకరించారు. ధాన్యం దిగుబడులపై అంచనా వేశారు. 3.29 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందనే అంచనాకు వచ్చారు. రైస్‌మిల్లర్లు 18 వేల టన్నులు కొనుగోలు చేస్తారని, పది వేల టన్నులు సీడ్ కోసం పోగా సుమారు మరో 65 వేల టన్నుల ధాన్యం స్థానిక అవసరాలకు వినియోగం కానుందని, మిగతా 2.35 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. 2.35 లక్షల టన్నుల కొనుగోలు కోసం గన్నీ సంచులు ఎన్ని అవసరం, వాటిలో కొత్తవి, పాతవి ఎన్ని కేటాయించాలనేది కూడా నివేదికలో ప్రతిపాదించారు.
కొనుగోలు కేంద్రాలు ఎన్నంటే..
రైతులకు మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతో ఏటా వానకాలం, యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలో గత ఏడాది వానకాలం ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 157 కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతుల నుంచి 1.97 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగినా ధాన్యం కొనుగోళ్ల కోసం గ్రామాల్లో 157 కేంద్రాలను ఏర్పాటు చేస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన గ్రామాల్లోనే ప్రస్తుతం కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో పీఏసీఎస్‌లకు 111, ఐకేపీకి 45, జీసీసీకి 1 చొప్పున కేటాయించాలని నివేదికలో పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వం గురువారం హైదరాబాద్‌లో జిల్లావారీగా వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రతిపాదనలపై పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించింది.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష జరిపారు. రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో గ్రామాల్లో సెంటర్ల ఏర్పాటు, వాటిలో వసతులు కల్పించడం, ధాన్యం కొనుగోలుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సన్నాహాలు చేపట్టారు. నవంబర్ నుంచి జిల్లాలో ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు, ముందుగా రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం తదితర మండలాల్లో మొదట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు. పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార, గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్, ట్రైబల్ వెల్ఫేర్, తూనికలు కొలతలు తదితర శాఖల అధికారులు ధాన్యం కొనుగోలు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు సెక్టార్ వారీగా పౌరసరఫరాల సంస్థ అధికారులు ట్రాన్స్‌పోర్టు టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అధికారులకు ఈ టెండర్ల ప్రక్రియ సవాల్‌గా మారింది.