దేవరుప్పుల, అక్టోబర్ 16;నాడు అంతా దుర్భిక్షం.. పాలకుల పట్టింపులేక వాగులు వట్టిపోగా, చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేక పంట భూములు బీళ్లుగా మారాయి. వాటినే నమ్ముకున్న రైతులు ఉపాధి లేక వలసబాట పట్టారు. స్వరాష్ట్రంలో సీఎం సీకేఆర్ ముందుచూపుతో ప్రాజెక్టులు, వాగులపై చెక్ డ్యాంలు నిర్మించి వ్యవసాయాన్ని పండుగ చేశారు. నాడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని దేవరుప్పుల వాగులో జలం ఇంకిపోయి ఎడారిగా మారింది. సీఎం కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టుల పుణ్యమా అని నేడు ఈ వాగు జీవనదిలా మారింది. 9 చెక్‌డ్యాంల నిర్మాణంతో 14 కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచి సాగుకు పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి.
దశాబ్దాలుగా ఎడారిని తలపించిన దేవరుప్పుల వాగు నేడు జీవనదిగా మారి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నది. దేవరుప్పుల మండలాన్ని రెండుగా చీల్చుతూ పారుతున్న ఈ వాగు పరీవాహకంలో మండలంలోని మెజార్టీ గ్రామాలు ఉన్నాయి. 60 ఏళ్ల క్రితం వాగులో పుష్కలంగా నీళ్లుండి వ్యవసాయం జోరుగా సాగేది. రానురాను ఉమ్మడి పాలకులు మన గొలుసుకట్టు చెరువులను పట్టించుకోకపోవడం, మరోవైపు వర్షపు నీటిని ఒడిసిపట్టే విధానాలను పాటించకపోవడంతో వాగు వట్టిపోయి సాగు నీళ్లు కరువై, ఉపాధి కోసం రైతులు వలస బాట పట్టారు. వాగు మొత్తం ఎడారిగా మారింది. వాగులో వేసిన బోర్లన్నీ నీరు లేక ఎండిపోయాయి. వాగు పక్క పొలముంటే రైతు ధనవంతుడనే రోజులు పోయి, బతకడమే గగనమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారు. ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశారు. మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించారు. పూడికతీత, కట్టల బలోపేతం, తూములకు మరమ్మతు వంటి పనులు చేయడంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఏటా సమృద్ధిగా కురుస్తున్న వానలకు తోడు ప్రాజెక్టుల నుంచి జలాలతో చెరువులు మత్తడి పోస్తుండగా, వాగులు జీవనదులుగా మారాయి. నాడు వట్టిపోయిన ఇదే దేవరుప్పుల వాగు జలజలా పారుతుండగా, దీనిపై వడ్లకొండ రిజర్వాయర్, రఘునాథపల్లి రిజర్వాయర్ నిర్మించారు. మరోవైపు దేవాదుల ప్రాజెక్ట్ నుంచి రిజర్వాయర్లకు నీరు రాగా, వాటితో మండలంలోని మెజార్టీ చెరువులు నిండుతున్నాయి.
9 చెక్‌డ్యాంల నిర్మాణం
నీటి ప్రవాహాన్ని ఒడిసిపట్టడానికి దేవరుప్పుల వాగుపై రూ.60 కోట్లు వెచ్చించి కోలుకొండ, చౌడూరు, రాంభోజీగూడెం, చినమడూరు, పెదమడూరు, కడవెండి, దేవరుప్పుల, గొల్లపల్లి గ్రామాల వద్ద చెక్‌డ్యాంలు నిర్మించారు. 14 కిలోమీటర్ల మేర బ్యాక్‌వాటర్ నిలువడంతో నదిని తలపిస్తున్నది. ఐదు నెలలుగా చెక్‌డ్యాంలు మత్తడి పోస్తున్నాయి. సంవత్సరంలో కనీసం 6 నెలలకుపైనే వాగు పారుతుండడంతో రైతులకు నీరు సమృద్ధిగా అందుతున్నది. భూగర్భ జలాలు పెరిగాయి. వేలాది ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నారు.