ఏటూరునాగారం, అక్టోబర్ 15 : రాష్ట్రస్థాయి గిరిజన విద్యార్థుల క్రీడా పోటీలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలోని కొమురంభీం స్టేడియం సిద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి 20వరకు జరిగే మూడు రోజుల క్రీడా పండుగ నిర్వహణకు ఏటూరునాగారం ఐటీడీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న 14, 17 ఏళ్ల బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. 834 మంది బాలికలు, 834మంది బాలురు కలిపి మొత్తం 1,668 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.
168 మంది కోచ్‌లు, ఇతరులు పాల్గొనేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో వాలీబాల్, కబడ్డీ, టెన్నికాయిట్, ఖోఖో, ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్ పోటీలుంటాయి. అథ్లెటిక్స్‌లో పరుగుపందెం, లాంగ్ జంప్, హైజంప్, ఇతర ఆటలు ఉంటాయి. ఇక రాత్రివేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు.
రాష్ట్రంలోని ఆరు జోన్ల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. ఉట్నూ రు జోన్-1, 2, ఏటూరునాగారం, భద్రాచలం, రెండు మైదాన ప్రాంతాలను జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్ నుంచి 140మంది బాలికలు, 140 మంది బాలురు పాల్గొనన్నారు. ఒక్కో జోన్ నుంచి ఒక్కో క్రీడలో రెండు జట్లు పాల్గొంటాయి. ఇందులో 14,17 సంవత్సరాల క్రీడాకారులు ఉంటారు.
క్రీడలకు మైదానం సిద్ధం
మూడు రోజుల పాటు జరిగే క్రీడలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు అధికారులు రెండు రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మైదానాన్ని మట్టి, ఇసుక పోసి చదును చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మైదానం పూర్తిగా అధ్వానంగా మారి క్రీడల నిర్వహణకు పనికి రాకుండా ఉంది. కాగా, మొరం, ఇసుక పోసి చదును చేస్తున్నారు. అలాగే స్టేడియంలో కొత్తగా స్టేజీ కూడా నిర్మిస్తున్నారు. క్రీడా మైదానం చుట్టూ ఉన్న ప్రహరీకి సున్నాలు వేసే కార్యక్రమం కూడా చేపట్టారు. క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా మెనూ తయారు చేస్తున్నారు. భీం స్టేడియానికి ఎదురుగా ఉన్న పీఎంఆర్సీ భవనం ఆవరణలో విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటుచేస్తున్నారు.
ఇక విద్యార్థులు రాత్రివేళ బస చేయడంతో పాటు కాలకృత్యాలు తీర్చుకునేందుకు పలుచోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో ఏటూరునాగారం ఐటీడీఏ ముందుడాలని ఇటీవల జరిగిన జోనల్ స్థాయి క్రీడల ముగింపు సమావేశంలో పీవో పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పాల్గొనే క్రీడాకారులకు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లిలో కొద్ది రోజులుగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇక జంపన్నవాగు దగ్గరగా ఉండడంతో ఇసుకలో వాలీబాల్, రన్నింగ్, కబడ్డీ ఆటల్లో రాణించే విధంగా పీడీలు కోచింగ్ ఇస్తున్నారు. వీరికి అవసరమైన పౌష్టికాహారం నిత్యం అందిస్తున్నారు.
మంత్రులకు ఆహ్వానం
క్రీడల ప్రారంభానికి రాష్ట్ర, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఎంపీ మాలోత్ కవిత, ములుగు, భద్రాచలం, డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కలెక్టర్లు, రాష్ట్రంలోని ఐటీడీఏ పీవోలు తదితరులను ఆహ్వానిస్తున్నారు. ఉదయం పది గంటలకు క్రీడలను ప్రారంభించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఐటీడీఏ పీవో అంకిత్ ప్రత్యేక చొరవ తీసుకుని క్రీడలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిర్వహణ కమిటీలను నియమించారు.