‘యువర్ అటెన్షన్ ప్లీజ్.. మీరు ఆర్డర్ చేసిన ఐటమ్స్ టేబుల్ మీదికి వస్తున్నది. చుకుచుకు రైలుబండి వేడివేడి బిర్యానీ తెస్తున్నది..’ ఇన్నాళ్లూ పెద్దపెద్ద దేశాల్లోనే కనిపించిన ఇలాంటి రైల్ రెస్టారెంట్ మన ఓరుగల్లులోనూ ఏర్పాటైంది. వరంగల్ నిట్ సమీపంలోని రిలయన్స్ స్మార్ట్-2 రెండో అంతస్తులోకి వెళ్లగానే అచ్చం రైల్వే స్టేషన్‌ను తలపించేలా ఉన్న ‘ప్లాట్‌ఫాం-65’ రెస్టారెంట్ విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఇక్కడ ఏ ఐటం ఆర్డర్ చేసినా బుల్లి రైలు తన బోగీపై మోసుకొని వేడివేడిగా మన చెంతకు తెస్తుంది. రెస్టారెంట్‌లోని ప్రతి టేబుల్ పైన తెలంగాణలోని అన్ని రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫాంలు దర్శనమిస్తాయి.
-హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 15
జంక్షన్లపేరుతో టేబుళ్లు
వరంగల్, కాజీపేట, మహబూబాబాద్, డోర్నకల్ రైల్వేస్టేషన్ల బోర్డులు.. ఉడిపి, కాచీగూడ, బొంబాయి జంక్షన్ల పేర్లతో ఏర్పాటు చేసిన టేబుల్స్ చూడముచ్చటగా ఉన్నాయి. రెస్టారెంట్లో మొత్తం 33 టేబుళ్లు, ఏడు రైళ్లు ఏర్పాటు చేశారు. వినియోగదారులు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫుడ్ ఐటమ్స్‌తో పాటు టేబుల్ నంబర్ (ప్లాట్‌ఫామ్ పేరు) కూడా ఎంటర్ చేస్తారు. గ్రీన్ సిగ్నల్ పడగానే రుచుల రైలుబండి పరుగందుకుంటుంది. ఆవురావురుమంటూ ఎదురుచూసే కస్టమర్స్‌కి రుచులెన్నో అందించి మళ్లీ జంక్షన్(కిచెన్)కు చేరుకుంటుంది. ఆర్డర్స్ లిస్ట్ చెక్ చేసి ఫుడ్ లోడ్ చేయగానే మేనేజర్ పచ్చజెండా ఊపేస్తాడు. ఇలా పొద్దున మొదలైన రైలు ప్రయాణం మాపటిదాకా నడుస్తూనే ఉంటుంది. సుమారు 200 రకాల డిష్‌లను ఈ రైళ్లు తెచ్చిస్తాయి. వీటిల్లో బిర్యానీ ఆర్డర్లే ఎక్కువ కాగా, ఈ వింతైన విందును ఆరగించేందుకు జనం ఎగబడుతున్నారు. 200 సీటింగ్ కెపాసిటీ ఉన్న రెస్టారెంట్, సెప్టెంబర్ 8 నుంచి నాన్‌స్టాప్‌గా నడుస్తున్నది.
వేగంగా.. వేడిగా..
ఈ రెస్టారెంట్లో వెయిటర్స్ ఉండరు. కానీ, అడిగింది ఆలస్యం కాకుండా బుల్లి రైలు కిచెన్‌లో రెడీ అయిన వేడివేడి ఫుడ్ ఐటమ్స్‌ను చకచకా టేబుల్స్‌పైకి తీసుకొస్తుంది. రెస్టారెంట్లో ఉన్న టేబుళ్లన్నింటినీ అనుసంధానం చేస్తూ ట్రాక్ ఉంది. ఏ టేబుల్ మీద ఆర్డరిస్తే ఆ టేబుల్ మీదికి రైలు ఫుడ్ ఐటంమ్స్తో వస్తుంది. ఇదంటా ప్రత్యేక సాంకేతికత ద్వారా మానిటరింగ్ చేస్తారు.
నగరంలో ఆకట్టుకుంటున్న‘ప్లాట్‌ఫాం-65’ట్రైన్ రెస్టారెంట్
ప్రజల నుంచి విశేష ఆదరణ
నిట్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్-65 ట్రైన్ రెస్టారెంట్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఏ మాత్రం తగ్గకుండా రుచికరమైన వెరైటీలను అందిస్తున్నాం. కస్టమర్లను ఆకట్టుకునేందుకు సర్వేశ్, మధు, వినోద్ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వినూత్నంగా ఆలోచించి ట్రైన్ రెస్టారెంట్‌ను స్థాపించారు. సెప్టెంబర్ 8న వరంగల్‌లో ఏర్పాటైంది. త్వరలో కరీంనగర్లో కూడా ప్రారంభిస్తాం. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే ట్రైన్ రెస్టారెంట్లో తెలంగాణ, ఆంధ్రా, నార్త్, సౌత్ ఇండియన్ డిషెష్తో పాటు వెల్లుల్ల కోడిచారు, తమలపాకు బజ్జీ, కోనసీమ కోడిపకోడి, కూచిపూడి చికెన్, పచ్చిమిర్చి కోడికూర, గోంగూర చికెన్, ఉలవచారు ప్రత్యేకంగా అందిస్తున్నాం.
-ఎం బాలసుబ్రహ్మణ్యం, వరంగల్ ఈడీ, ప్లాట్‌ఫామ్-65 ట్రైన్ రెస్టారెంట్
క్రియేటివిటీ అదిరింది
ఆర్డర్ చేసిన ఐటమ్స్ ట్రైన్లో టేబుల్ దాకా రావడం చాలా బాగుంది. కొత్త క్రియేటివిటీ వీళ్లకు పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు రైలు రెస్టారెంట్‌కు మంచి ఇమేజ్ ఉంది. ట్రైన్ కాన్సెప్ట్ ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఇందులో చాలా వెరైటీలున్నాయి. ఫుడ్ ఐటమ్స్ టేస్టీగా ఉన్నాయి.
-కే మనోహర్‌రావు, రిటైర్డ్ టీచర్
ఐడియా బాగుంది
కొత్త ఆలోచనలతో ఏర్పాటు చేసిన రైల్ రెస్టారెంట్‌కు మా ఫ్యామిలీతో కలిసి రెండోసారి వచ్చా. ట్రైన్స్ ఏర్పాటు చేసి వాటిని ఆపరేట్ చేసే టెక్నాలజీ బాగుంది. ఆర్డర్ చేసిన ఫుడ్ రైలులో రావడం కొత్తగా ఉంది. మొత్తంగా రైల్ రెస్టారెంట్ ఐడియా బాగుంది. ఇక్కడివస్తే చాలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది.
-నవీన్, వరంగల్