గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ఆదివారం ఉదయం 10:30గంటలకు నిర్వహించే ఈ పరీక్ష కోసం జిల్లాకేంద్రంలో 27 సెంటర్లను కేటాయించగా 9,716 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కేంద్రానికి అన్నిచోట్ల తాగునీరు, వైద్యం సహా సందేహాల నివృత్తికి 18004253424 టోల్ ఫ్రీ నంబర్‌తో హెల్ప్‌లైన్‌ను అందుబాటులో ఉంచారు. ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి నేతృత్వంలో ప్రతి సెంటర్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు కేంద్రాల్లో ఏర్పాట్లను ఎగ్జామినేషన్ చీఫ్ కో ఆర్డినేటర్, కలెక్టర్ బీ గోపి పరిశీలించారు. కలెక్టర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అభ్యర్థులు పరీక్షా సమయానికి రెండు గంటల ముందే చేరుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలేవీ తీసుకెళ్లవద్దు. ప్రశాంతం గా పరీక్ష రాయండి. ఆల్ ది బెస్ట్.!!
ఖిలావరంగల్, అక్టోబర్ 15 : జిల్లాకేంద్రంలో ఆదివారం జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 27 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు 9,716 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణ కోసం చీఫ్ కోఆర్డినేటర్ (జిల్లా కలెక్టర్), అడిషనల్ చీఫ్ కోఆర్డినేటర్ (అడిషనల్ కలెక్టర్), 7-లైజన్ ఆఫీసర్లు, 27 అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు (5 రిజర్వ్), 2-చీఫ్ సూపరింటెండెంట్లు, 3-రూట్ ఆఫీసర్లు, సుమారు 170 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు.
కేంద్రాల్లో ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టర్ బీ గోపి అధికారులతో సమావేశమయ్యారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, సీటింగ్ అరేంజ్మెంట్స్, హెల్ప్‌డెస్క్, రిజిస్ట్రేషన్ కౌంటర్, బారికేడ్లతో పాటు ఇతర వసతులపై దిశా నిర్దేశం చేశారు. కేంద్రాల వద్ద తాగునీరు, టాయిలెట్స్, వైద్య శిబిరంతో పాటు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను అమలుచేసేందుకు ఒక ఎస్సై, ఐదుగురు సిబ్బందితో ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక ఒరిజినల్ పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌ను వెంట తీసుకొని కేంద్రం లోపలికి తీసుకువెళ్లాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం. కేవలం చెప్పులు వేసుకొని మాత్రమే పరీక్షకు రావాలి. ఓఎంఆర్ ఆన్సర్ షీట్‌పై హాల్‌టికెట్ నంబర్, వెన్యూ కోడ్ మాత్రమే రాయాలి. ఓఎంఆర్ షీట్‌పై ఆన్సర్స్ గుర్తించడానికి బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్నును మాత్రమే వినియోగించాలి. పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపించరు.
ప్రతి అరగంటకు ఒకసారి బెల్ మోగుతుంది. అభ్యర్థులకు కేంద్రాల సమాచారం తెలిసేలా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే దివ్యాంగుల కోసం ప్రతి కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కండ్లు కనిపించని వారికి స్రైబ్స్తో పరీక్ష రాసేందుకు అనుమతిచ్చారు. అలాగే కలెక్టరేట్లో 9154252936 ప్రత్యేక టోల్ ఫ్రీననెంబర్ ఏర్పాటుచేసి అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు.