జిల్లాలో ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్సామ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా సీసీ కెమెరాలతో పర్యవేక్షించనుండగా ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 121 సెంటర్లను గుర్తించగా 42,514 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. నిర్ణీత సమయం (ఉదయం 10.30గంటలు) కంటే రెండు గంటల ముందే సెంటర్‌కు చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 10.15గంటల తర్వాత వస్తే అనుమతించరు. దివ్యాంగ అభ్యర్థులు సెంటర్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పరీక్ష రాసేలా చర్యలు తీసుకుంటున్నారు.
– వరంగల్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో ఈ నెల 16న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ సైతం కీలక మార్పులు చేసింది. తొలిసారి బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టింది. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మాస్ కాపీయింగ్ జరుగకుండా ఉండేందుకు జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు.
ఓఎమ్మార్ షీట్లో బబ్లింగ్ చేసేటప్పుడు అభ్యర్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష సమయం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు కాగా, అభ్యర్థులు ఉదయం 8.30 వరకే సెంటర్‌కు చేరుకోవాలి. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. దివ్యాంగ అభ్యర్థులు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పరీక్ష రాసేలా చర్యలు తీసుకుంటున్నారు.
అభ్యర్థి హాల్‌టికెట్‌పై ఫొటో సరిగా లేకుంటే అభ్యర్థులు మూడు పాస్‌ఫొటోలు తీసుకొని గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించి నిర్ణీత ప్రొఫార్మాలో పరీక్షా కేంద్రంలో అప్పగిస్తేనే పరీక్షకు అనుమతిస్తారు. హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఐడీ కార్డు (ఆధార్/పాన్‌కార్డు/ ఓటర్ ఐడీ/ఎంప్లాయి ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్/ పాస్ పోర్టు) తీసుకురావాలి. అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వాడాలి. హాల్‌టికెట్ నంబర్, ఓఎంఆర్ జవాబు పత్రంలో బుక్లెట్ సంఖ్య, సెంటర్ కోడ్ సరిగ్గా వేయాలి. ఈ సారి సిరీస్ ఏ, బీ, సీ, డీ నుంచి ఆరు అంకెల సంఖ్యకు మార్చారు.
ఓఎంఆర్ షీట్‌పై వైట్నర్, చాక్పవర్, బ్లేడ్, ఎరైజర్లాంటివి వినియోగించరాదు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు బయటకు వెళ్లరాదు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https: www.tspsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. అందులోని సూచనలను జాగ్రత్తగా చూసుకోవాలి. పరీక్ష కేంద్ర సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయిస్తారు. సెంటర్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికారాలు, బ్యాగులు, పుస్తకాలను ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరు.
121 కేంద్రాలు.. 42,514 మంది అభ్యర్థులు
హనుమకొండ జిల్లా కేంద్రంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ కోసం 49 సెంటర్లను గుర్తించారు. వీటిలో 21,024 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. 15 రూట్లుగా విభజించి 15 మంది రూట్ ఆఫీసర్లను, సీనియర్ అధికారులను, 15మంది లైజనింగ్ ఆఫీసర్లు, సెంటర్‌కు ఒక్కరి చొప్పున 49 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. వరంగల్ జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను గుర్తించగా 9,716 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. జనగామ జిల్లాలో 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 3,410 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మహబూబాబాద్‌లో 15 సెంటర్లు ఏర్పాటు చేయగా 4,058 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
15 మంది సూపరింటెండెంట్లు, ఐదుగురు లైజనింగ్ అధికారులను నియమించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 9 సెంటర్లు ఏర్పాటు చేశారు. 2,373మంది హాజరుకానున్నారు. ములుగులో 7 సెంటర్లు ఏర్పాటు చేయగా, 1,933 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 121 కేంద్రాల్లో 42,514మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ రాయనున్నారు. అభ్యర్థులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. నిరంతరం విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.