‘మన ఊరు-మనబడి’, ‘మన బస్తీ – మనబడి’ కార్యక్రమం కింద జిల్లాలోని సర్కారు బడులు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. తొలి విడుత ఎంపికైన 223 పాఠశాలలకు రూ.51.15కోట్లు మంజూరయ్యాయి. అందులో 158 పాఠశాలల నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా, రూ.30లక్షల లోపు పనులను ఎస్ఎంసీలు ప్రారంభించాయి. 13కు పైగా పాఠశాలల్లో పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పలు పాఠశాలలకు కలర్ వేస్తున్నారు. రూ.30లక్షలకు పైగా ఉన్న పనుల టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది.
వరంగల్, అక్టోబర్ 10 (నమస్తేతెలంగాణ): మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలో తొలి విడుత ఎంపికైన పాఠశాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 51.15 కోట్లు కేటాయించింది. ఈ మేరకు 223 సర్కారు బడుల్లో పనులు చేపట్టేందుకు పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చింది. దీంతో పనులను మరింత వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)ల ద్వారా చేపట్టిన పనుల్లో అధికారులు కొంత పురోగతి సాధించారు. 13కు పైగా పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. పలు పాఠశాలల్లో అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విడుతల వారీగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడుతలో జిల్లాలో 35 శాతం పాఠశాలలను ఎంపిక చేసింది. అవసరాలను గుర్తించి వీటిని ఈ ఏడాది అభివృద్ధి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ మేరకు విద్యాశాఖ అధికారులు తొలి విడుత అభివృద్ధి పనులు చేపట్టేందుకు జిల్లాలో 223 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లకు ఈ జాబితాలో చోటు కల్పించారు. ఆయా మండలానికి ప్రభుత్వం కేటాయించిన ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఎస్ఎంసీలు, ప్రధానోపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో 223 పాఠశాలలను సందర్శించారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి దశల వారీగా అంచనాలు రూపొందించారు. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ఈ అంచనాలకు ఎప్పటికప్పుడు కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. 223 పాఠశాలలకు మొత్తం రూ. 51.15 కోట్లు మంజూరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం నుంచి ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో చేపట్టే వివిధ అభివృద్ధి పనులు అదనమని తెలిపారు.
రూ.5 కోట్ల చెల్లింపులు
మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో చేపట్టే రూ. 30 లక్షలలోపు అభివృద్ధి పనులను కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ. 30 లక్షలకుపైగా విలువ చేసే పనులను టెండర్ల ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించాలని పేర్కొంది. ఈ క్రమంలో ఇంజినీర్ల అంచనాల ప్రకారం రూ. 30 లక్షలలోపు పనులు గల పాఠశాలలు జిల్లాలో 166 ఉంటే.. రూ. 30 లక్షలకు పైగా విలువ గల పనుల పాఠశాలలు 57 ఉన్నాయి. దీంతో రూ. 30 లక్షలలోపు అభివృద్ధి పనులు చేయాల్సి ఉన్న 166 పాఠశాలల్లో అధికారులు ఇప్పటి వరకు 165 స్కూళ్ల పనులను ఎస్ఎంసీలకు కేటాయించారు. ఈ మేరకు ఎస్ఎంసీలు అగ్రిమెంట్ కుదుర్చుకొని 158 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టాయి.
ఫలితంగా అధికారులు ప్రభుత్వం కేటాయించిన నిధులను ఈ 158 పాఠశాలల ఎస్ఎంసీ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్ ఆర్డర్(ఎఫ్‌టీవో) ప్రక్రియ పూర్తి కావడంతో 158 పాఠశాలల్లో అభివృద్ధి పనుల కోసం కలెక్టర్ రూ. 5 కోట్లు విడుదల చేశారు. వీటిలో ప్రభుత్వ నిబంధనల మేరకు రివాల్వింగ్ ఫండ్ కింద రూ. 4.05 కోట్లు, పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేసిన ఎస్ఎంసీలకు ఎంబీ రికార్డు ప్రకారం రూ. 95 లక్షలు అధికారులు చెల్లింపులు జరిపారు.
పలు పాఠశాలల్లో ఎస్ఎంసీలు పనులను వేగిరం చేయడంతో ఎంబీ రికార్డు ప్రకారం ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిపే దిశగా ముందుకు వెళ్తున్నారు. పనులు మొదలైన ప్రభుత్వ పాఠశాలల్లో మండలానికి ఒకటి చొప్పున పదమూడింటిలో అభివృద్ధి, మరమ్మతు పనులు పూర్తి కావడంతో రంగులు వేసే పనులు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. పర్వతగిరి మండలకేంద్రంలోని జడ్పీఎస్‌ఎస్‌లో ప్రస్తుతం రంగులు వేసే పనులు కొనసాగుతున్నాయని, మరో ఐదు పాఠశాలల్లోనూ అభివృద్ధి పనులు తుది దశకు చేరినట్లు విద్యాశాఖ అధికారి సుధీర్ తెలిపారు.
టెండర్ల ప్రక్రియ నిర్వహణ
30 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి వివిధ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. 57 పాఠశాలల్లో ఇప్పటికే కొన్ని స్కూళ్ల పనుల టెండర్లను ఖరారు చేశారు. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు పాఠశాలల్లో పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇతర పాఠశాలల పనుల టెండర్ల ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, టాయిలెట్లు, ప్రహరీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులు కూడా పాఠశాలల్లో వీలైనంత త్వరగా చేపట్టాలని ఇటీవల కలెక్టర్ బీ గోపి ఓ సమావేశంలో ఎంపీడీవోలను ఆదేశించారు.