సంగెం, అక్టోబర్ 9: గుప్తనిధుల కోసం శనివారం అర్ధరాత్రి దుండగులు తీగరాజుపల్లిలోని ఎస్సారెస్పీ కాల్వ సమీపంలో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి, శివాలయం, హనుమాన్ విగ్రహం ప్రాంతంలో జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. స్థానికుల కథనం ప్రకారం.. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గ్రామానికి చేరుకున్నారు. అనంతరం రెండు ఆలయాల మధ్య జేసీబీతో పది మీటర్ల పొడవు, వెడల్పుతో పెద్ద గొయ్యి తీశారు. దాని చుట్టూ నిమ్మకాయలు పెట్టారు.
పని ముగిసిన తర్వాత గొయ్యిని పూడ్చి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం అటువైపు వెళ్లిన గ్రామస్తులు చూసి దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. ఇరవై ఏళ్ల క్రితం కొందరు వ్యక్తులు గర్భగుడిలోనే తవ్వకాలు జరిపి అందులోని శివలింగాన్ని పగులగొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం కూడా గుర్తుతెలియని వ్య క్తులు తవ్వకాలు జరిపినట్లు పేర్కొన్నారు. ఇక్కడ తవ్వకాలు జరుపడం ఇది మూడోసారి అని తెలిపారు.
తవ్వకాల తర్వాత జేసీబీ కెనాల్ నుంచి తిరిగి గాంధీనగర్ రోడ్డు నుంచి తీగరాజుపల్లి మీదుగా గవిచర్ల రోడ్డుపై వెళ్లిందని, ప్యాసింజర్ ఆటోలో కొంతమంది దాని వెనుకాలే వచ్చి నేరు గా ఎన్టీఆర్ సెంటర్ వైపు వెళ్లిందని పలువురు గ్రామంలో చర్చించుకుంటున్నారు. గవిచర్ల రోడ్డు లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే వివరాలు తెలి సే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.